Ashes Series 2023: గడిచిన ఏడాదికాలంగా  ‘బజ్‌బాల్’ ఆటతో టెస్టు క్రికెట్ ఆడే విధానాన్ని మార్చేస్తున్న ఇంగ్లాండ్ తాజాగా  మరో వినూత్న ఫీల్డ్ సెటప్‌తో ముందుకొచ్చింది. ఇంతవరకూ  ప్రపంచ  క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా   సెట్ చేయని (?) ఫీల్డ్ సెటప్‌ను  బెన్ స్టోక్స్ సెట్ చేశాడు.  సెంచరీ చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆదుకున్న  ఉస్మాన్ ఖవాజాను  ఔట్ చేయడానికి  స్టోక్స్  సరికొత్త వ్యూహాన్ని పన్నాడు.  ఈ వ్యూహం పేరే బ్రంబ్రెల్లా (Brumbrella).. అంబ్రెల్లా పేరు విన్నాంగానీ ఈ బ్రంబ్రెల్లా అంటే ఏంటి..? 


ఫీల్డ్ సెటప్ ఇలా.. 


అప్పటికే  సెంచరీ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు ఉస్మాన్ ఖవాజా. అండర్సన్, బ్రాడ్, రాబిన్సన్, మోయిన్ అలీ.. ఆఖరికి  ఖవాజాను ఔట్ చేయడానికి తాను కూడా బౌలింగ్ చేశాడు స్టోక్స్. అయినా ఫలితం లేదు.  ఇక ఇలా అయితే  కాదు.. ఏదైనా కొత్తగా చేయాలని  వినూత్న రీతిలో ఫీల్డ్  సెట్ చేశాడు.


స్లిప్స్, బౌండరీ వద్ద ఉండే ఫీల్డర్లను ముందుకు  రప్పించాడు. సిల్లీ పాయింట్, సిల్లీ మిడాఫ్ వద్ద ముగ్గురుని,  సిల్లీ మిడాన్, షార్ట్ లెగ్ వద్ద ముగ్గురు (మొత్తం ఆరుగురు)ని మొహరించాడు.   బ్యాటర్ వెనుకాల వికెట్ కీపర్.  అతడి ముందు బౌలింగ్ వేసే బౌలర్.   అభిమన్యుడు పద్మవ్యూహంలో  చిక్కుకున్నట్టు ఉస్మాన్ ఖవాజాను ఇంగ్లీష్ ఫీల్డర్లు చుట్టుముట్టారు. అయితే  షాట్ ఆడాలి. లేదా క్యాచ్ ఇవ్వాలి. ఇంతకు మించి వేరే ఆప్షన్లు లేకుండా చేసేశారు. 


వ్యూహం సిద్దమైంది.  ఓలీ రాబిన్సన్ బౌలర్. వేసేది పేసర్ కాబట్టి టచ్ చేస్తే బంతి అక్కడే ఉన్న ఫీల్డర్ల మధ్య పడాలి. లేదా భారీ షాట్ ఆడటానికి ఉసిగొల్పితే వికెట్ పారేసుకునే అవకాశం ఉంటుంది. రాబిన్సన్ తొలి రెండు బంతులు కాస్త స్లో గా ఊరిస్తూ వేశాడు. తర్వాత బంతి కూడా ఇలాగే వేస్తాడేమోనని భావించిన  ఖవాజా.. లెగ్ స్టంప్ కూడా వదలిపెట్టి  షాట్ ఆడేందుకు రెడీ అయ్యాడు. అంతే.. ఖవాజా స్టోక్స్ గాలానికి చిక్కాడు.  ముందుకొచ్చి షాట్ ఆడుదామని ఖవాజా రెండడుగులు ముందుకేశాడు. బంతి మిస్ అయింది.   కానీ అది దాని గమ్యాన్ని మాత్రం  విజయవంతంగా ముద్దాడింది. ఖవాజా నుంచి మిస్ అయిన బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది.  


 






బ్రంబ్రెల్లా అంటే.. 


ఈ తరహా ఫీల్డ్ సెటప్‌ను బ్రంబ్రెల్లా అంటారంటూ ట్విటర్ లో  ఈ వర్డ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. బ్రంబ్రెల్లా అంటే అదేదో  ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ‌లో కొత్తగా వచ్చిన పదమేమీ కాదు.  ఆ ఫీల్డ్ సెటప్‌ను చూస్తే అది గొడుగు విధానంలో ఉంటుంది.  గొడుగుకు ఉన్న  ఇనుప రాడ్‌ను పిచ్ అనుకుంటే  దాని కింది భాగంలో ఉన్నది హ్యాండిల్ వికెట్ కీపర్. పైన  కొన బౌలర్.  చుట్టూ ఉండే ప్లాస్టిక్ కవర్‌కు సపోర్ట్‌గా ఉండే తీగలు ఇక్కడ సెట్ చేసిన ఫీల్డర్లు. చూడటానికి ఇది  పూర్తిగా ఒక అంబ్రెల్లా మాదిరిగానే ఉంటుంది. 


ఇదొక్కటే కాదు.. వాస్తవానికి  ఎడ్జ్‌బాస్టన్  లో గతంలో ఉన్న ఓ పిచ్‌ను కూడా ఇలాగే పిలిచేవారట. ఈ బ్రంబ్రెల్లా అనే పదం.. బర్మింగ్‌హోమ్ నిక్ నేమ్ (బ్రమ్), ఈ పిచ్‌ను వర్షం నుంచి తడవకుండా ఉపయోగించే భారీ రెయిన్ ప్రూఫ్  కవర్‌ (అంబ్రెల్లా) నుంచి వచ్చింది. 1981 నుంచి 2001 వరకూ దీనిని బర్మింగ్‌హోమ్‌లో వాడారట. బ్రంబ్రెల్లాను ఎక్కువగా పిచ్ తో పాటు ఔట్ ఫీల్డ్ పాడవకుండా  వాడేవారట. ఒక మిషీన్ సాయంతో దీనిని ఆపరేట్ చేసేవారట. కానీ  2001 తర్వాత దీని వాడకాన్ని ఆపేశారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial