Ashes 2023: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న  యాషెస్ సిరీస్ తొలి టెస్టులో  కంగారూలను విజయం ఊరిస్తోంది.  ఏడు పరుగుల నామమాత్రపు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో  రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్..  ఆసీస్ బౌలర్ల ధాటికి తడబడింది.   సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు.. 66.2 ఓవర్లలో 273 పరుగులకే ఆలౌట్ అయింది.  దీంతో ఆస్ట్రేలియా ముందు 280 పరుగుల విజయలక్ష్యం నిలిపింది.  


ఇంగ్లాండ్.. సీన్ రివర్స్


దూకుడుగా ఆడే క్రమంలో ఇంగ్లీష్ బ్యాటర్లు  భారీ స్కోర్లు నమోదుచేయలేకపోగా  భాగస్వామ్యాలు కూడా నిర్మించలేకపోయారు.  మూడో రోజు  27 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో  రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు  జో  రూట్ (55 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1 సిక్సర్), ఓలీ పోప్ (16 బంతుల్లో 14, 2 ఫోర్లు)  మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  రూట్ ధాటిగా ఆడగా  పోప్ మాత్రం ఇబ్బందిపడ్డాడు.  ఆసీస్ సారథి పాట్ కమిన్స్ వేసిన  17వ ఓవర్లో ఆరో బంతికి పోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.


పోప్ నిష్క్రమించినా హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 46, 5 ఫోర్లు)  తో కలిసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నడిపించిన   రూట్‌ను స్పిన్నర్ నాథన్ లియాన్ పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే  హ్యారీ బ్రూక్ కూడా లియాన్ బౌలింగ్‌లోనే లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 


వరుసగా వికెట్లు కోల్పోతుండటంతో  ఇంగ్లాండ్ దూకుడు తగ్గించింది.   కెప్టెన్ బెన్ స్టోక్స్ (66 బంతుల్లో 43, 5  ఫోర్లు)  నెమ్మదించగా బెయిర్‌స్టో (39 బంతుల్లో 20, 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. బెయిర్‌స్టోను లియాన్ వికెట్ల ముందు బలిగొనగా.. స్టోక్స్‌ను  కమిన్స్ ఎల్బీగా వెనక్కిపంపాడు.  మోయిన్ అలీ (31 బంతుల్లో 19, 2 ఫోర్లు, 1 సిక్స్)  రాబిన్సన్ (44 బంతుల్లో27, 2 ఫోర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. జేమ్స్ అండర్సన్ (12) ను కమిన్స్ ఔట్ చేయడంతో  ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 273 పరుగుల వద్ద ముగిసింది.  


ఆస్ట్రేలియా బౌలర్లలో  కెప్టెన్ కమిన్స్‌తో పాటు  లియాన్ తలా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను నిలువరించడంలో సక్సెస్ అయ్యారు.  బొలాండ్, హెజిల్‌వుడ్‌లకు చెరో వికెట్ దక్కింది.  


 






ఓడితే అబాసుపాలు.. 


ఏడాదికాలంగా బజ్‌బాల్  దృక్పథంతో  ఆడుతూ అందరితో ప్రశంసలు దక్కించుకుంటున్న ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం  అబాసుపాలు కాక తప్పదు. తొలి ఇన్నింగ్స్‌లో 393-8 పరుగుల వద్ద మొదటిరోజు 78 ఓవర్లే ఆడి ఇంగ్లాండ్ డిక్లేర్ ఇచ్చింది.  ముందు దీనిని ‘బోల్డ్ డిసీషన్’ అనుకున్నా రెండు, మూడో రోజు కూడా ఆసీస్ బ్యాటింగ్ చేయడంతో ‘ఏదో తేడా కొట్టేట్టుంది’అని ఇంగ్లాండ్ మాజీలు కూడా అభిప్రాయపడ్డారు.  వాళ్లు భయపడ్డట్టే  రెండో ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ సేన 273 పరుగులకే కుప్పకూలింది.  మరి నేడు మూడో సెషన్‌తో పాటు రేపు రోజంతా మిగిలిఉన్న నేపథ్యంలో   280 పరుగులను ఛేదించడం పెద్ద విషయమేమీ కాదు. ఇంగ్లాండ్ పేస్ త్రయం  జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్‌లు ఏమైనా అద్బుతాలు చేస్తే తప్ప ఆసీస్ విజయాన్ని అడ్డుకోవడం ఇంగ్లాండ్‌కు కత్తిమీద సామే...!