Ashes 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా  జరుగుతున్న  తొలి టెస్టులో మూడో రోజు వరుణుడు ఆటను అడ్డుకున్నాడు.  ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిశాక.. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పది ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత  ఆటను అడ్డుకున్న వరుణుడు మళ్లీ  ఆడే ఛాన్స్ ఇవ్వలేదు.  ఈ టెస్టులో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే రెండో ఇన్నింగ్స్ ప్రదర్శనే కీలకం కానుంది. ఈ నేపథ్యంలో నాలుగో రోజైన నేటి ఆట ఇరు జట్లకు కీలకం కానుంది. 


ఆసీస్ ఆలౌట్.. 


311 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో  మూడో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ వెటరన్  పేసర్ జేమ్స్ అండర్సన్ తొలి షాకిచ్చాడు.  హాఫ్ సెంచరీ చేసి జోరుమీద కనిపించిన  వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (66)  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేరీ ఔటయ్యాక  ఆసీస్ సారథి పాట్ కమిన్స్‌ (62 బంతుల్లో 38, 3 సిక్సర్లు)తో కలిసి ఉస్మాన్ ఖవాజా  (321 బంతుల్లో 141, 14 ఫోర్లు, 3 సిక్సర్లు)  లు ఆస్ట్రేలియా స్కోరును 350 పరుగులు దాటించారు. 


అయితే ఫస్ట్ సెషన్‌లో డ్రింక్స్ విరామం తర్వాత  ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓలీ రాబిన్సన్ బౌలింగ్ ఖవాజా బౌల్డ్  అయ్యాడు.   నాథన్ లియాన్ (1) ను కూడా రాబిన్సన్ ఔట్ చేశాడు.  స్కాట్ బొలాండ్ (0) ను స్టువర్ట్ బ్రాడ్  పెవిలియన్ చేర్చగా.. రాబిన్సన్  బౌలింగ్ లో కమిన్స్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ 386 పరుగుల వద్ద ముగిసింది.  తొలి ఇన్నింగ్స్ లో  ఇంగ్లాండ్.. 393 పరుగులు  చేసిన విషయం తెలిసిందే. 


 






ఇంగ్లాండ్‌కు షాక్.. 


ఏడు పరుగుల  తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన  ఇంగ్లాండ్‌కు ఆదిలోనే డబుల్ స్ట్రోక్ తాకింది. ఫస్ట్ ఇన్నింగ్స్  లో విఫలమైన బెన్ డకెట్  (28 బంతుల్లో 19, 1 ఫోర్) ఈ  ఇన్నింగ్స్‌లో కూడా  నిరాశపరిచాడు.  కమిన్స్  వేసిన 9వ ఓవర్లో నాలుగో బంతికి డకెట్.. గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో  హాఫ్ సెంచరీ చేసిన జాక్ క్రాలీ (25 బంతుల్లో 7) ను స్కాట్ బొలాండ్ బోల్తా కొట్టించాడు.  దీంతో ఇంగ్లాండ్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.  ప్రస్తుతం ఓలీ పోప్ (0 నాటౌట్),  ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్ (0 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్  35 పరుగుల ఆధిక్యంలో ఉంది.


 






ఈ టెస్టులో మరో రెండు రోజుల ఆట మిగిలుంది. నాలుగో రోజు వరుణుడు కరుణిస్తే  ఇంగ్లాండ్ దూకుడుగా ఆడి ఆఖరి సెషన్‌లో ఆసీస్ కు బ్యాటింగ్ అప్పగించొచ్చు.  అయితే  ఎడ్జ్‌బాస్టన్ పిచ్ రాను రాను  బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. కానీ  వర్షం కారణంగా పిచ్ బౌలర్లకు అనుకూలిస్తే మాత్రం  అప్పుడు విజయం కోసం ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరుగడం ఖాయం...!