Ashes Series 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో ప్రతిష్టాత్మక సిరీస్ శుక్రవారం నుంచి ఇంగ్లీషు గడ్డ మీద మొదలుకానుంది. సుమారు శతాబ్దంన్నర కాలంగా క్రికెట్‌లోని రెండు అగ్రశ్రేణి జట్లు ‘బూడిద’ (యాషెస్) కోసం చేస్తున్న సమరం రేపట్నుంచి (మే 16) ఇంగ్లాండ్ వేదికగా మరోసారి కనువిందు చేయనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచి ప్రపంచ ఛాంపియన్‌లుగా ఉన్న ఆస్ట్రేలియా.. ‘బజ్‌బాల్’ ఊపులో ఉన్న ఇంగ్లాండ్‌లు బర్మింగ్‌హోమ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో యాషెస్ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
ఆ పేరేలా వచ్చిందంటే..
ప్రతీ ఏడాది యాషెస్ సమయంలో ఇది చర్చలోకి వచ్చేదే అయినా టూకీగా చెప్పుకోవాలంటే 1882లో లండన్‌లోని ఓవల్ వేదికగా జరిగిన ఓ టెస్టులో ఆసీస్ చేతిలో ఇంగ్లీష్ జట్టు ఘోర పరాజయం పాలైంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌కు ఇదే తొలి ఓటమి. ఈ ఓటమిని జీర్ణించుకోలేని నాటి ‘స్పోర్టింగ్ టైమ్స్’ రిపోర్టర్ రెజినాల్ట్ షిర్లీ.. ‘1882, ఆగస్టు 29న ఇంగ్లీష్ క్రికెట్ చచ్చిపోయింది. ఆ శరీరాన్ని కాల్చి బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారు’ అని భారీ హెడ్డింగ్‌తో రాశాడు.
ఇది జరిగిన కొన్ని వారాలకు ఆసీస్‌లో పర్యటించిన ఇంగ్లాండ్ సారథి ఐవో బ్లై.. మట్టితో తయారుచేసిన చిన్న కప్పును ప్రదర్శించి ఇదే యాషెస్‌కు చిహ్నం.. దీనిని తిరిగి ఇంగ్లాండ్‌కు తీసుకొస్తామని శపథం చేశాడు. నాటి నుంచి దీనికి యాషెస్ అని పేరు వచ్చింది. యాషెస్ ఒరిజినల్ ట్రోఫీ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లోనే ఉండగా గెలిచిన జట్టుకు అందజేసేది దాని డూప్లికేట్ వర్షన్.
ఆధిపత్యం ఆసీస్‌దే..
సుమారు 150 ఏండ్లుగా జరుగుతున్నా ఈ సిరీస్‌లో ఆసక్తి ఇసుమంతైనా తగ్గలేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐసీసీ ట్రోఫీల కంటే యాషెస్ నెగ్గడమే ముఖ్యం. మిగతా టోర్నీలు, సిరీస్ లలో ఎలా ఆడినా యాషెస్ లో మాత్రం ఇరు జట్ల ఆటగాళ్లు 110 శాతం ప్రదర్శనను ఇస్తారు. ఈ సిరీస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, స్టేడియానికి వచ్చే అభిమానులను చూస్తే ఇరు దేశాలకు ఈ వైరం మీద ఉన్న ఆసక్తేంటో అర్థం చేసుకోవచ్చు.
యాషెస్‌లో ఇప్పటివరకు 72 సిరీస్ (మాములుగా సిరీస్‌కు ఐదు టెస్టు మ్యాచ్‌లు) లు జరిగాయి. ఇందులో ప్రారంభంలో ఇంగ్లాండ్ వరుసగా 8 సిరీస్ లు గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ తర్వాత ఆసీస్.. ఇంగ్లాండ్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. మరీ ముఖ్యంగా 1902 తర్వాత ఆసీస్ ఆధిపత్యం పెరిగింది. ఇక ప్రపంచ క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ ఆగమనంతో ఆసీస్ ఆధిపత్యం పెరిగింది. మొత్తంగా ఇప్పటివరకూ జరిగిన 72 సిరీస్‌లలో కంగారూలు 34 గెలువగా ఇంగ్లాండ్ 32 సార్లు విజేతగా నిలిచింది. ఆరు సిరీస్ లు డ్రా అయ్యాయి.
యాషెస్‌లో ఇప్పటివరకూ మొత్తంగా 356 టెస్టులు జరుగగా ఇందులో ఆసీస్ 150.. ఇంగ్లాండ్ 110 గెలిచింది. ఏకంగా 96 టెస్టులు డ్రా అయ్యాయి.
అత్యధిక వీరులు :
ఇప్పటివరకు యాషెస్‌లో 150 టెస్టులు జరిగినా ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డైతే ఇ(ఎ)ప్పటికీ డాన్ బ్రాడ్‌మన్ పేరిటే ఉంది. ఆయన తన కెరీర్ (1928 - 1948 వరకూ) లో యాషెస్ టెస్టులు 37 ఆడారు. 63 ఇన్నింగ్స్ లలో ఏకంగా 89.78 సగటుతో ఎవరికీ అందనంత ఎత్తులో 5,028 పరుగులు సాధించారు. ఇందులో ఏకంగా 19 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆయన తర్వాత జెబి హోబ్స్ (41 టెస్టులు - 3,636), అలెన్ బోర్డర్ (42- 3,222) స్టీవ్ వా (42 - 3,173) ఉన్నారు.
ప్రస్తుతం ఆసీస్ జట్టులో ఉన్న ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్.. స్టీవ్ వా తర్వాతి స్థానంలో నిలిచాడు. స్మిత్.. 32 టెస్టులు ఆడి 56 ఇన్నింగ్స్ లలో 3,044 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్.. యాషెస్ లో 29 టెస్టులు ఆడి 2,106 రన్స్ సాధించి అత్యధిక పరుగులు సాధించినవారిలో 30వ స్థానంలో నిలిచాడు.
ఇక బౌలర్ల విషయానికొస్తే.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్.. 36 టెస్టులలో 195 వికెట్లు తీసి ఈ లిస్టులో టాప్ లో నిలిచాడు. 1993లో మైక్ గాటింగ్‌కు అతడు వేసిన బంతి ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ యాషెస్ లో నమోదైందే.. వార్న్ తర్వాత గ్లెన్ మెక్‌గ్రాత్ (157 వికెట్లు), హెచ్. ట్రంబుల్ (ఇంగ్లాండ్.. 141 వికెట్లు) ఉన్నారు. ప్రస్తుతతరంలో స్టువర్ట్ బ్రాడ్.. 35 టెస్టులలో 131 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్.. 35 టెస్టులలో 112 వికెట్లు తీసి టాప్ - 10 లో పదో స్థానంలో నిలిచాడు.
8 ఏండ్లుగా స్వదేశంలో నో సిరీస్..
1986-87 తర్వాత యాషెస్ లో ఇంగ్లాండ్.. 2005లో అత్యద్భుత విజయాన్ని అందుకుంది. యాషెస్ పోరుల్లో ఇది క్లాసిక్ అని చెబుతుంటారు. మైఖేల్ వాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ ఈ సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. 2015లో ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ లో ఆసీస్‌ను ఓడించడమే ఆ జట్టుకు స్వదేశంలో ఆఖరి సిరీస్ విజయం. ఆ తర్వాత 2019 లో సిరీస్ 2-2 తో డ్రా అయింది. గతేడాది ఆసీస్‌లో జరిగిన యాషెస్‌ను ఆసీస్ 4-0తో గెలుచుకుంది.
యాషెస్ - 2023 షెడ్యూల్ :
- ఫస్ట్ టెస్ట్ : జూన్ 16-30 (బర్మింగ్‌హోమ్)
- సెకండ్ టెస్ట్ : జూన్ 28-జులై 2 (లార్డ్స్)
- థర్డ్ టెస్ట్ : జులై 6-10 (హెడింగ్లీ)
- ఫోర్త్ టెస్ట్ : జులై 19-23 (మాంచెస్టర్)
- ఫిఫ్త్ టెస్ట్ : జులై 27-31 (ఓవల్)