Asia Cup 2023 Date: 


ఆసియాకప్‌ -2023కి మార్గం సుగమమైంది! మొత్తానికి సందిగ్ధం తొలగిపోయింది. టోర్నీని హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌, శ్రీలంక సంయుక్తంగా మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు మ్యాచులు జరుగుతాయి. పూర్తి స్థాయి షెడ్యూలు ఇంకా రూపొందించలేదు. మరికొన్ని రోజుల్లోనే విడుదల చేస్తారని సమాచారం.


వాస్తవంగా ఆసియాకప్‌ టోర్నీ పాకిస్థాన్‌లోనే జరగాలి. కానీ టీమ్‌ఇండియా దాయాది దేశంలో అడుగు పెట్టబోదని బీసీసీఐ ఖరాకండీగా చెప్పేయడంతో హైబ్రీడి మోడల్‌కు మారింది. దీనికి ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అంగీకరించింది. మొత్తం 13 మ్యాచుల్లో 4 పాకిస్థాన్‌, మిగిలినవి శ్రీలంకలో జరుగుతాయి.


మొత్తానికి 2008 తర్వాత పాకిస్థాన్‌ రెండు కన్నా ఎక్కువ దేశాలు ఆడే టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. 'ఆసియాకప్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించాలన్న మా ప్రతిపాదనను ఏసీసీ అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. అంటే ఈ టోర్నీకి పీసీబీ హోస్ట్‌గా ఉంటుందన్నమాట. కొన్ని మ్యాచులు పాక్‌లో మిగిలినవి శ్రీలంకలో జరుగుతాయి. టీమ్‌ఇండియా మా దేశానికి రాలేని పరిస్థితుల్లో ఉండటమే ఇందుకు కారణం' అని పీసీబీ చీఫ్ నజమ్‌ సేథీ అన్నారు.


'పదిహేను ఏళ్లలో తొలిసారి పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడుతుందని మా అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ బీసీసీఐ పరిస్థితిని మేం అర్థం చేసుకున్నాం. పీసీబీ మాదిరిగానే వారికీ సరిహద్దులు దాటేటప్పుడు ప్రభుత్వ అనుమతి అవసరం. నిర్వహణ, లాజిస్టిక్స్‌ పరంగా మేం ఏసీసీ, శ్రీలంక క్రికెట్‌ బోర్డుతో నిరంతరం టచ్‌లో ఉంటాం. ప్లానింగ్‌, ప్రిపరేషన్‌లో భాగం అవుతాం' అని నజమ్‌ సేథీ అన్నారు.


ఆసియాకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఒకే గ్రూపులో ఉన్నాయి. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి. రెండు విభాగాల్లో టాప్‌లో నిలిచిన రెండు జట్లు కలిసి సూపర్‌ 4 స్టేజ్‌లో తలపడతాయి. అందులో టాప్‌-2లో నిలిచిన టీమ్స్‌ ఫైనల్లో తలపడతాయి. అక్టోబర్‌-నవంబర్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఉండటంతో టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. కాగా అన్నీ కలిసి వస్తే భారత్‌, పాకిస్థాన్‌ మళ్లీ మూడు సార్లు తలపడే అవకాశం ఉంటుంది. లీగ్‌ దశలో ఒకసారి, సూపర్‌-4లో రెండోసారి పోటీపడతాయి. ఒకవేళ సూపర్‌-4లో టాప్‌2లో రెండు జట్లూ నిలిస్తే ఫైనల్లో ఆడతాయి.


గతేడాది యూఏఈలో నిర్వహించిన ఆసియాకప్‌ను శ్రీలంక గెలిచింది. 20 ఓవర్ల ఫార్మాట్లో ఫైనల్లో టీమ్‌ఇండియాను ఓడించింది. 2018లోనూ యూఏఈలోనే వన్డే ఫార్మాట్లో జరగ్గా ఫైనల్లో బంగ్లాదేశ్‌ను భారత్‌ ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. 


హైబ్రీడ్‌ మోడల్‌ను బీసీసీఐ మొదటి నుంచీ నిరాకరిస్తోంది. ఒకవేళ అంగీకరిస్తే వన్డే ప్రపంచకప్‌ను ఇలాగే నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతుందని అనుమానించింది. అలాగే బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ సైతం హైబ్రీడ్‌ మోడల్‌ను వ్యతిరేకించాయి. కాగా కొన్ని మ్యాచుల్ని దుబాయ్‌లో పెట్టాలని పాక్ భావించగా బంగ్లా గట్టిగా వ్యతిరేకించింది. సెప్టెంబర్లో అక్కడి వాతావరణం అనువుగా ఉండదని అభ్యంతరం చెప్పింది.


రెండు వారాల క్రితం ఏసీసీ ఉపాధ్యక్షుడు, ఒమన్‌ క్రికెట్‌ అధినేత పంకజ్‌ ఖిమిజినీ పీసీబీ చీఫ్ నజమ్‌ సేథీ కలిశారు. హైబ్రీడ్‌ మోడల్‌ గురించి చర్చించారు. రెండు దేశాల మధ్య రాజకీయ విభేదాలతో టీమ్‌ఇండియా పాక్‌కు వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారని తెలిపింది. వీరిద్దరూ ఒక పరిష్కారం కోస ప్రయత్నించారని సమాచారం. 'ఇప్పటికైతే భారత్‌ లేని మ్యాచుల్ని లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో నిర్వహిస్తారు. పాకిస్థాన్‌ vs నేపాల్‌, బంగ్లాదేశ్‌ vs అఫ్గానిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ vs శ్రీలంక, శ్రీలంక vs బంగ్లాదేశ్ మ్యాచులు అక్కడ ఉంటాయి. భారత్‌ vs పాకిస్థాన్‌, సూపర్‌ 4 మ్యాచులన్నీ పల్లెకెలె లేదా గాలెలో ఉంటాయి' అని ఏసీసీ వర్గాలు మీడియాకు తెలిపాయి.