Texas Super Kings Squad: బేస్‌బాల్, హ్యాండ్ బాల్, ఎన్బీఎ ఆటలతో బోర్ కొట్టిన అమెరికా క్రీడాభిమానులకు క్రికెట్ మజాను పంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ పెద్దన్న అమెరికాలో తొలిసారి ఓ పూర్తిస్థాయి ఫ్రొఫెషనల్ టీ20 లీగ్ జరుగనున్నది. వచ్చే నెల 13 నుంచి మొదలుకాబోయే ఈ మెగా టీ20 లీగ్‌కు ‘మేజర్ లీగ్ క్రికెట్’ (ఎంఎల్‌సీ) అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఆరు జట్లు పాల్గొనబోయే ఈ నయా క్రికెట్ లీగ్ కూడా మినీ ఐపీఎలే. ఇందులో నాలుగు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఓనర్లే దక్కించుకోగా మిగిలిన రెండు జట్లను సొంతం చేసుకుందీ భారత సంతతి వ్యక్తులే..
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. రెండు సార్లు విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఫ్రాంచైజీలకు కొనుగోలు చేసింది. జులై 13 నుంచి మొదలుకాబోయే ఈ లీగ్ 17 రోజుల పాటు నార్త్ టెక్సాస్ వేదికగా అభిమానులను అలరించనున్నది.
ఎంఎల్‌సీలో ఫ్రాంచైజీల వివరాలు :
- టెక్సాస్ సూపర్ కింగ్స్ (చెన్నై సూపర్ కింగ్స్)
- లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
- ఎంఐ న్యూయార్క్ (ముంబై ఇండియన్స్)
- సియాటెల్ ఆర్కాస్ (ఢిల్లీ క్యాపిటల్స్).. ఈ ఫ్రాంచైజీలో మైక్రోసాఫ్ట్ సీవీవో సత్య నాదెళ్ల కూడా పెట్టుబడులు పెట్టారు.
- వాషింగ్టన్ ఫ్రీడమ్
- సాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్
రాయుడు, బ్రావో రీఎంట్రీ..
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. ఆశ్చర్యకరంగా ఎంఎల్‌సీలో మెరువనున్నాడు. అతడితో పాటు సీఎస్కేకు సుదీర్ఘకాలంగా ఆడి ఈ సీజన్ లో బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన డ్వేన్ బ్రావో కూడా టెక్సాస్‌కు ఆడనున్నారు. ఈ మేరకు టెక్సాస్ సూపర్ కింగ్స్ తన అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశవాళీలోగానీ, భారత జాతీయ జట్టు తరఫున గానీ ఆడే క్రికెటర్.. విదేశీ లీగ్ లలో ఆడకూడదు. ఒకవేళ అలా ఆడాలంటే ఇక్కడ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడమో లేక మరోసారి ఇక్కడ ఆడమని నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అయినా తీసుకోవాలి. తాజా రిపోర్టుల ప్రకారం ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న రాయుడు.. విదేశీ లీగ్ ల వైపు చూడటం గమనార్హం. అయితే రాయుడును ఆడిస్తున్న చెన్నై.. మిస్టర్ ఐపీఎల్ గా పేరొందిన సురేశ్ రైనాను విస్మరించడం విస్మయాన్ని కలిగించేదే...!
టెక్సాస్ ఓవర్సీస్ ప్లేయర్స్: అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కోయిట్జ్ (సౌతాఫ్రికా పేసర్), డేనియల్ సామ్స్ (ఆస్ట్రేలియా), మిచెల్ శాంట్నర్, డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)
సపోర్ట్ స్టాఫ్ : స్టీఫెన్ ఫ్లెమింగ్ (హెడ్ కోచ్), ఎరిక్ సిమ్మన్స్ (అసిస్టెంట్ కోచ్), ఆల్బీ మోర్కెల్ (అసిస్టెంట్ కోచ్), రసెల్ రాధాకృష్ణన్ (టీమ్ మేనేజర్)