Ashes Series 2023: యాషెస్  సిరీస్ లో భాగంగా  ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య  ఆదివారం ముగిసిన రెండో టెస్టులో  ఇంగ్లీష్ జట్టు వికెట్ కీపర్  జానీ బెయిర్ స్టో  స్టంపౌట్ కొత్త వివాదానికి దారితీసింది.  దీనిపై ఇంగ్లాండ్ మాజీలు ఎప్పటిలాగే.. ‘క్రీడా స్ఫూర్తి’ రాగం అందుకోగా   ఆస్ట్రేలియా మాజీలు మాత్రం.. ‘ఇది రూల్స్ లో ఉన్నదే కదా’అని  ఒకరిమీద ఒకరు విమర్శలు  చేసుకుంటున్నారు.  


అసలేం జరిగింది..? 


లార్డ్స్ టెస్టు ఐదో రోజు ఆటలో బెన్ డకెట్ నిష్క్రమించిన తర్వాత  ఇంగ్లాండ్ వికెట్ కీపర్  జానీ బెయిర్ స్టో బ్యాటింగ్ కు వచ్చాడు. 22 బంతులాడిన  బెయిర్ స్టో.. కామెరూన్ గ్రీన్ వేసిన 53వ ఓవర్ లో  చివరి బంతి బౌన్సర్ గా రావడంతో దాని నుంచి తప్పించుకునే క్రమంలో కిందకు వంగాడు. బాల్ వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లో పడింది. ఓవర్ ముగిసింది కదా  అని బెయిర్ స్టో.. అవతలి ఎండ్ లో ఉన్న  స్టోక్స్ తో ముచ్చటించడానికని క్రీజును కదిలాడు. కానీ అదే అతడి పాలిట శాపమైంది.  బెయిర్ స్టో క్రీజు దాటగానే కేరీ..  రెప్పపాటు క్షణంలోనే స్పందించి తక్కువ ఎత్తులోనే బంతిని వికెట్ల మీదుగా విసిరాడు. బెయిర్  స్టో అప్పటికే క్రీజు వదలడం.. బెయిల్స్ పడిపోవడంతో  ఆసీస్ ఫీల్డర్లు.. అది ఔట్ అని అంపైర్ కు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ దానిని ఔట్ అని ప్రకటించాడు. టీవీ అంపైర్ నుంచి కూడా అదే సమాధానం వచ్చింది.  ఇంగ్లాండ్ కు షాక్.. ఆస్ట్రేలియాకు బ్రేక్.. 


 






క్రీడా స్ఫూర్తి.. 


ఇక మ్యాచ్ ముగిశాక  ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇదే విషయమై మాట్లాడుతూ.. ఆసీస్ ఆటతీరుపై  అసంతృప్తి వ్యక్తం చేశాడు. రూల్స్ ప్రకారం బెయిర్ స్టో ఔట్ అయినా తామైతే ఇలా చేసి గెలవమని, ఇలాంటి గెలుపు తమకొద్దని వాపోయాడు. అలాంటి అవకాశం వచ్చినా తాము అలా చేయబోమని,  అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమన్నట్టుగా వ్యాఖ్యానించాడు. ఇక క్రికెట్ లో తమ జట్టు ఓడిపోయినప్పుడు మాత్రమే ఇంగ్లాండ్ కు, ఆ దేశ మీడియాకు గుర్తొచ్చే క్రీడాస్ఫూర్తి రాగాన్ని  ఇంగ్లీష్ ఆటగాళ్లు మళ్లీ అందుకున్నారు. పలువురు ఇంగ్లాండ్ మాజీలు..  ‘ఇది అన్యాయం’ అని గగ్గోలు పెడుతున్నారు.  లార్డ్స్ లో  ఇంగ్లాండ్ మద్దతుదారులు అయితే.. ‘వన్స్ ఏ చీటర్.. ఆల్వేస్ చీటర్’ అంటూ కంగారూలను తిట్టిపోశారు.  ఆస్ట్రేలియన్లు మాత్రం.. ‘బంతి డెడ్ కాకముందే  క్రీజును వదలడం బెయిర్ స్టో చేసిన తప్పు.  కేరీ నిబంధనల మేరకే నడుచుకున్నాడు. దానిలో క్రీడా స్ఫూర్తి ఏముంది..?’ అన్నట్టుగా కౌంటర్ ఇచ్చారు.  


గంభీర్ ఘాటు కౌంటర్... 


 






బెయిర్ స్టో  రనౌట్ వివాదంపై  టీమిండియా మాజీ ఓపెనర్, ఈశాన్య ఢిల్లీ ఎంపీ  గౌతం గంభీర్ స్పందించాడు.    క్రీడా స్ఫూర్తి గురించి జరుగుతున్న చర్చలో  గంభీర్ ట్విటర్ ద్వారా ఆసీస్ జట్టును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘హే స్లెడ్జర్స్.. క్రీడా స్ఫూర్తి మీకు వర్తించదా..? కేవలం భారతీయులకేనా..?’ అంటూ ఆసీస్ పై మండిపడ్డాడు.  



Join Us on Telegram: https://t.me/abpdesamofficial