Ashes Series 2023: యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ లో మూడు రోజుల క్రితమే ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ను ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ఔట్ చేయడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ‘క్రీడా స్ఫూర్తి’ అంటూ ఇంగ్లాండ్ లెక్చర్లు ఇస్తుంటే ‘అవి రూల్స్.. కావాలంటే చదువుకోండి’అని ఆసీస్ కౌంటర్లు ఇస్తుంది. ఇరు దేశాల ప్రధానులు కూడా ఈ వివాదంపై స్పందించారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ వివాదంపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కేరీ చేసింది సరైనదే..
బెయిర్ స్టో విషయంలో కేరీ చేసింది సరైందేనని, క్రీడా స్ఫూర్తి అని చెప్పి ఆట నిబంధనలను మరిచిపోతే ఎలా అని అశ్విన్ ప్రశ్నించాడు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో స్పందిస్తూ.. ‘నాన్ స్ట్రైకర్ రనౌట్ గానీ ఇలాంటి (బెయిర్ స్టో రనౌట్) ఔట్ గానీ అయినప్పుడు మాత్రమే క్రికెట్ లో క్రీడా స్ఫూర్తి అనే పదం వినిపిస్తుంది. కేరీ.. బెయిర్ స్టో ను ఔట్ చేసేందుకు ముందుగానే ప్రణాళికలు వేసుకున్నాడని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. ఇదేం క్రీడా స్ఫూర్తి..? ఓవర్ చివరి బంతి కావున బెయిర్ స్టో క్రీజు వదిలి ముందుకొచ్చాడు. అదే సమయంలో కేరీ కూడా చాకచక్యంగా వ్యవహరించి స్టంప్స్ ను పడగొట్టాడు..
వాస్తవానికి ఇక్కడ బెయిర్ స్టో రన్ తీయడానికి ముందుకు రాలేదన్న మాట నిజమే అయిన ఓవర్ ముగిసిన తర్వాత జాగ్రత్తగా లేకపోవడం వల్లే ఇలా జరిగింది. రంజీ అయినా ఇంటర్నేషనల్ స్థాయిలో అయినా గేమ్ కు సంబంధించిన రూల్స్ ను అందరూ పాటించాలి. ఓవర్ ముగిసిన వెంటనే బ్యాటర్ క్రీజు దాటి ముందుకు వెళ్తే అప్పుడు కీపర్ గానీ, స్లిప్ ఫీల్డర్ గానీ సదరు బ్యాటర్ ను రనౌట్ చేసే అవకాశం లేకపోలేదు. అది నిబంధనల్లో కూడా ఉంది. బెయిర్ స్టో విషయంలో అలెక్స్ కేరీ చేసింది కూడా ఇదే. ఇంగ్లాండ్ కీపర్ బ్యాటర్ పదే పదే ముందుకు కదలడాన్ని గమనించిన కేరీ.. ఛాన్స్ రాగానే దానిని సద్వినియోగం చేసుకున్నాడు..’ అని పేర్కొన్నాడు.
నేనైతే బాధపడతా..
ఇక ఇదే విషయమై ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ ట్విటర్ వేదికగా.. ‘ఈ విషయం గురించి అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. కానీ నాకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువతో నా స్నేహితుడు అశ్విన్ ను ఈ ప్రశ్న అడుగుతున్నా..? ఒకవేళ నువ్వు ఇలా ఔట్ అయితే సంతోషంగా ఉంటావా..?’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఆష్ అన్న (అశ్విన్ ను అభిమానులు పిలుచుకునే పేరు) స్పందిస్తూ.. ‘నేను ఇలా ఔట్ అయితే చాలా నిరాశచెందుతా. వాస్తవానికి అలా బయిటకు వచ్చినందుకు బాధపడతా..’ అని రిప్లై ఇచ్చాడు.