Wimbledon 2023: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో గతేడాది విడుదలై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని  ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే.   అమలాపురం నుంచి  అమెరికా దాకా ఈ పాటకు  కాలు కదపనోళ్లు లేరంటే అతిశయెక్తి కాదు.   ప్రపంచ వేదికలపై  స్థానం దక్కించుకున్న  ‘నాటు నాటు’ తాజాగా  టెన్నిస్  లోని అతి పురాతమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన  ‘వింబూల్డన్ ఛాంపియన్షిప్’ను కూడా  తాకింది. 


గత నెల  26 నుంచే మొదలైనా  ఈనెల 3 నుంచే  మొదటి రౌండ్ పోటీలు ప్రారంభమైన వింబూల్డన్ లో  టాప్ సీడ్  కార్లోస్ అల్కరాస్, నొవాక్ జకోవిచ్ కూడా  నాటు నాటు సిగ్నేచర్ మూమెంట్ తో  సందడి చేశారు. అయితే  ఈ ఇద్దరూ  నాటు నాటు పాటకు  కాలు కదపకపోయినా వింబూల్డన్ నిర్వాహకులు మాత్రం.. అల్కరాస్, జకోవిచ్ లు  ఈ పాటకు డాన్స్ చేస్తున్నట్టుగా   పోస్టర్ ను రిలీజ్ చేస్తూ  ‘కార్లోస్ అల్కరాస్, నొవాక్ జకోవిచ్ లు  వింబూల్డన్ కు రెడీ అవతున్నారు. ఇక నాటు నాటు  నాటుయే’ అని  ఇద్దరి ఫోటోను  షేర్ చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 


 






ఫైనల్ అతడితోనే..? 


ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ మాదిరిగానే వింబూల్డన్ లో కూడా అల్కరాస్ - జకోవిచ్ ల మధ్యే తుది పోరు ఉండనుందని అభిమానులు భావిస్తున్నారు. తాజా పోస్టర్ కూడా దీనినే  సూచిస్తున్నది.  కాగా తొలి రౌండ్ లో జకోవిచ్, అల్కరాస్ లు తమ ప్రత్యర్థులను ఓడించి  రెండో రౌండ్ కు చేరుకున్నారు.






మార్గరెట్ రికార్డుపై కన్ను.. 


వరల్డ్ నెంబర్ వన్ అల్కరాస్, నెంబర్ 2 జకోవిచ్ ఇటీవలే  ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో తలపడిన విషయం తెలిసిందే. హోరాహోరిగా సాగిన ఈ పోరులో   జకోవిచ్.. అల్కరాస్ ను ఓడించి రికార్డు స్థాయిలో  23వ గ్రాండ్ స్లామ్ నెగ్గి  పురుషుల  ఓపెన్ టెన్నిస్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అతడు రఫెల్ నాదల్ పేరిట ఉన్న 22 గ్రాండ్ స్లామ్స్ రికార్డును  బ్రేక్ చేశాడు. ఇందులో  ఆస్ట్రేలియా ఓపెన్ లో 10, 3 ఫ్రెంచ్ ఓపెన్, 3 యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉండగా వింబూల్డన్ లో ఏడు టైటిల్స్ ఉన్నాయి. ఈ టైటిల్ తో  జకోవిచ్.. సెరెనా విలియమ్స్ 23 టైటిల్స్ రికార్డును సమం చేశాడు.  టెన్నిస్ చరిత్రలో  అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన క్రీడాకారులలో మార్గరెట్ కోర్ట్ అందరికంటే ముందుంది. మార్గరెట్.. 24 గ్రాండ్  స్లామ్స్ గెలిచింది.  ఈ వింబూల్డన్ కూడా  నెగ్గితే   జకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ఆటగాడిగా మార్గరెట్ రికార్డును సమం చేస్తాడు.





Join Us on Telegram: https://t.me/abpdesamofficial