Praveen Kumar: భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ప్రవీణ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన ప్రవీణ్.. తన ల్యాండ్ రోవర్ కారులో పాండవ్ నగర్ నుంచి బాగ్పట్ కు వస్తుండగా మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
క్రికెట్ నుంచి తప్పుకున్నాక మీరట్ లోని ముల్తాన్ నగర్ లో ఉంటున్న ప్రవీణ్ కుమార్.. మంగళవారం రాత్రి కారులో కొడుకుతో పాటు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. భారీ లోడ్ తో వస్తున్న ఓ ట్రక్కు.. మూల మలుపు ఉన్న ప్రాంతంలో ప్రవీణ్ కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అయితే అక్కడ ఉన్న స్థానికులు త్వరగా ప్రవీణ్ కుమార్ తో పాటు అతడి కొడుకును స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ట్రక్కు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేశారని మీరట్ పోలీసులు తెలిపారు.కారు డ్యామేజ్ అయినా ప్రవీణ్ కుమార్, అతడి కొడుకు మాత్రం క్షేమంగానే ఉన్నట్టు ఈ మాజీ పేసర్ కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రవీణ్ కుమార్ భారత జట్టులో 2007 నుంచి నుంచి 2012 వరకూ కొనసాగాడు. టీమిండియా తరఫున ఆరు టెస్టులు, 68 వన్డేలు, పది టీ20లు ఆడాడు. టెస్టులలో 27 వికెట్లు తీసిన ప్రవీణ్.. వన్డేలలో 77 వికెట్లు పడగొట్టాడు. టీ20లలో 8 వికెట్లు తీశాడు. భారత జట్టు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన సీబీ సిరీస్ లో గెలవడానికి ప్రవీణ్ కీలక పాత్ర పోషించాడు. ఇక మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ప్రవీణ్ ఓ వెలుగు వెలిగాడు. అయితే తర్వాత ఫామ్ కోల్పోవడం, గాయాల పాలవడంతో పాటు జట్టులోకి షమీ, బుమ్రా వంటి బౌలర్లు స్థిరపడిపోవడంతో ప్రవీణ్ ఫేడ్ అవుట్ అయ్యాడు.
భారత జట్టులో చోటు దక్కకపోయినా ప్రవీణ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం 2017వ సీజన్ వరకూ కొనసాగాడు. 2008 నుంచి 2010 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన ప్రవీణ్.. 2014, 2015లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు. 2016, 17 సీజన్లలో గుజరాత్ లయన్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్ లో 119 మ్యాచ్ లు ఆడిన ప్రవీణ్ కుమార్.. 90 వికెట్లు తీశాడు. ఐపీఎల్ - 2010 సీజన్ లో ఆర్సీబీ తరఫున ఆడుతూ అతడు హ్యాట్రిక్ కూడా పడగొట్టాడు. 2012, 2013 సీజన్లలో ప్రవీణ్ కుమార్ మెరుగ్గా రాణించాడు.