Ajit Agarkar: కొద్దిరోజులుగా సాగుతున్న సస్పెన్స్ కు  తెరపడింది.  అందరూ ఊహించినట్టుగానే టీమిండియా మాజీ  పేసర్ అజిత్ అగార్కర్ భారత సీనియర్ పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా నియమితుడయ్యాడు. ఈ మేరకు  నిన్న  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నిన్నా మొన్నటిదాకా ఈ పదవి కోసం రవిశాస్త్రి, వెంగసర్కార్ పేర్లు కూడా వినిపించినా  క్రికెట్ అడ్వైజరీ కమిటీ  (సీఏసీ)మాత్రం అగార్కర్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు  బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. 


‘సులక్షణా నాయక్, అశోక్ మల్హోత్ర, జతిన్ పరంజపెలతో కూడిన సీఏసీ సభ్యులు.. మెన్స్ సెలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న  పోస్టు కోసం  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన  సీఏసీ అగార్కర్ పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.  అనంతరం మిగిలిన సెలక్టర్లతో పోలిస్తే అంతర్జాతీయ అనుభవం ఎక్కువగా ఉన్న అగార్కర్ కే చీఫ్ సెలక్టర్ పోస్ట్ కు అతడి పేరును  ప్రతిపాదించింది..’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. 


సెలక్షన్ కమిటీ మాజీ చీఫ్  ఛేతన్ శర్మ ఈ ఏడాది  ఫిబ్రవరిలో ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో టీమిండియా ఆటగాళ్లు, బోర్డు సభ్యులు, ఇతరత్రా వివరాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి  ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు. అప్పట్నుంచి ఖాళీగానే ఉన్న  చీఫ్ సెలక్టర్ పదవిని అగార్కర్ భర్తీ చేయనున్నాడు. తొలుత ఈ పదవి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో భర్తీ చేయనున్నారని వార్తలు వచ్చినా  వాటిని వీరూ కొట్టిపారేశాడు.  అగార్కర్ విషయంలో కూడా  సాలరీ దగ్గర  చర్చ జరిగినా.. బీసీసీఐ  అతడికి చీఫ్ సెలక్టర్ వేతనం పెంచుతామని హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.  ప్రస్తుతం చీఫ్ సెలక్టర్ కు  కోటి రూపాయలు, మిగిలిన నలుగురు సభ్యులకు  రూ. 90 లక్షలు అందజేస్తున్నారు. 






 


బీసీసీఐ సెలక్షన్ కమిటీ : 


- అజిత్ అగార్కర్ (ఛైర్మన్) 
- శివసుందర్ దాస్ 
- సుబ్రతో బెనర్జీ 
- సలిల్ అంకోలా 
- శ్రీధరన్ శరత్


అగార్కర్ గురించి.. 


ముంబైకి చెందిన అగార్కర్  1998 నుంచి 2007 వరకు భారత జట్టుకు సేవలందించాడు.  టీమిండియా తరఫున  26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు కూడా ఆడాడు. 26 టెస్టులలో 58 వికెట్లు తీసిన అగార్కర్.. వన్డేలలో మాత్రం 288 వికెట్లు పడగొట్టాడు.  నాలుగు టీ20లలో  3 వికెట్లు తీశాడు.  బౌలర్ గానే గాక  పలు సందర్భాల్లో అతడు బ్యాట్ తో కూడా విలువైన పరుగులు చేశాడు.   టెస్టులలో అగార్కర్ పేరిట ఓ సెంచరీ కూడా నమోదైంది.  వన్డేలలో అగార్కర్ మూడు అర్థ సెంచరీలు సాధించాడు.  జాన్ రైట్ భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో అగార్కర్ ను బౌలర్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా ముందుకు పంపి ఫలితాలు రాబట్టాడు.  వన్డేలలో 21 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన అగార్కర్.. లార్డ్స్ లో  ఇంగ్లాండ్ తో  జరిగిన  తొలి టెస్టులో సెంచరీ కూడా  సాధించాడు. 


ఆటగాడిగా రిటైర్ అయ్యాక అగార్కర్..  కామెంటేటర్ గానే గాక ముంబై  రంజీ టీమ్ చీఫ్ సెలక్టర్ గా కూడా పనిచేశాడు.  గత రెండు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ కు అసిస్టెంట్ కోచ్ గా పనిచేశాడు. కానీ చీఫ్ సెలక్టర్ రేసులో ఉన్న అగార్కర్.. ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశాడు.











Join Us on Telegram: https://t.me/abpdesamofficial