Ind vs eng 5Th Test Latest Live Updates: ఇంగ్లాండ్ తో ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో భారత బౌలింగ్ లైనప్ పై ప్రస్తుతానికి ఒక స్పష్టత వచ్చింది. తాజాగా జరిగిన నెట్ సెషన్ లో యువ పేసర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేస్తూ, తీవ్రంగా శ్రమించాడు. దీంతో అతను ద ఓవల్ టెస్టులో ఆడటం ఖాయంగా మారిందని తెలుస్తోంది. నిజానికి మాంచెస్టర్, ద ఓవల్ టెస్టుల్లో అతడిని ఆడించాలని భావించినా, నాలుగో టెస్టుకు ముందు జరిగిన ట్రైనింగ్ సెషన్ లో అతను గాయపడ్డాడు. బౌలింగ్ చేసే వేలికి గాయం కావడంతో నాలుగో టెస్టు నుంచి తప్పించారు. దీంతో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ ను ఈ మ్యాచ్ కు ఎంపిక చేశారు. అయితే సాధారణమైన బౌలింగ్ తో అతను నిరాశ పరిచాడు. ముఖ్యంగా 120+ కిమీ వేగంతో బౌలింగ్ చేయడం తనకు మైనస్ గా మారింది. ఇంగ్లీష్ బ్యాటర్లు అతడిని సులువుగా ఎదుర్కొన్నారు. ఈ టెస్టులో తను కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. నిజానికి ఈ టెస్టుకు ముందు అతనిపై ఎన్నో అంచనాలు ఉన్నా కానీ, వాటిని నిలబెట్టుకోలేక పోయాడు. గతి తప్పిన బౌలింగ్ తో నిరాశ పర్చాడు.
పూర్తి ఫిట్ గా..
పరిమిత ఓవర్ల క్రికెట్ లో అర్షదీప్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా నిలిచాడు. అయితే చాలా రోజుల నుంచి తను సుదీర్ఘ ఫార్మాట్ లో ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. నాలుగో టెస్టులో ఆ అవకాశం వచ్చినా, గాయం కారణంగా జట్టుకు దూరం కాక తప్పలేదు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ద ఓవల్ టెస్టులో తను ఆడటం ఖాయంగా మారింది. మహ్మద్ సిరాజ్ తో కలిసి తను బౌలింగ్ చేస్తాడు. మరో పేసర్ ఆకాశ్ దీప్ ఆడే అవకాశముంది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఈ సీరస్ కు ముందు ప్రకటించినట్లుగా మూడు టెస్టులకే పరిమితమయ్యే క్రమంలో సిరాజ్, అర్షదీప్, ఆకాశ్ దీప్ లతో కలిసి భారత పేస్ దళం బరిలోకి దిగనుంది.
చాలా ప్లస్ పాయింట్..
ఇక జట్టులో స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆడటం ఖాయం కానుండటంతో లెఫ్టార్మ్ పేసరైన అర్షదీప్ ఆడితే భారత్ కు చాలా అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తను బౌలింగ్ లైనప్ కారణంగా పిచ్ కు రెండో వైపు రఫ్ ఏర్పడి, అది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని, అలాగే, లెఫ్టార్మ్ పేస్ కారణంగా బౌలింగ్ లోనూ వైవిధ్యం ఏర్పడుతుందని అంటున్నారు. మరోవైపు పిచ్ పరిస్థితిని బట్టి, శార్దూల్ ఠాకూర్.. కుల్దీప్ యాదవ్ లలో ఒకరిని ఆడించే అవకాశముంది. ఇక ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.