Asia Cup News: ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై దుమారం రేగింది. టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా దాదాపు ఒకటిన్నర నెల సమయం ఉంది. ఇందులో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి (India vs Pakistan Asia Cup). భారత్ పార్లమెంటులో కూడా పాకిస్తాన్‌తో ఆడకూడదనే అంశాన్ని లేవనెత్తారు. కొద్ది రోజుల క్రితం WCL 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేసింది. ఆ తర్వాత, BCCI ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడటానికి అంగీకరించిందని వార్త రాగానే, భారతదేశమంతా ఒక నిప్పురవ్వ రాజుకుంది, అది ఇప్పుడు మంటలా వ్యాపిస్తోంది. వీధి వీధిలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను వ్యతిరేకిస్తున్నారు, అయితే BCCI ఎందుకు అంగీకరించింది. భారత ప్రభుత్వం ఎందుకు ఆపలేదు? ఇక్కడ పూర్తి నిజం తెలుసుకోండి.

BCCI ఎందుకు అంగీకరించింది?

పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలు చరిత్రలో అత్యంత దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు పాకిస్థాన్ పేరు చెబితేనే జనం ఊగిపోతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు చల్లబడినప్పటికీ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ మాత్రం పోవడం లేదు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడటానికి BCCI ఎందుకు అంగీకరించింది? దీని వెనుక కారణం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

గత ఒకటిన్నర దశాబ్దాలుగా భారత్, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. 2036 ఒలింపిక్స్‌కు భారత్ బిడ్ వేసింది. అయితే ఏదైనా బహుళ జాతి పోటీలకు ఆతిథ్యం ఇవ్వాలంటే, భారత్‌కు తన ప్రత్యర్థులతో ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

అది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం భారత్ జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఆసియా కప్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ప్రభుత్వం రెండు టోర్నమెంట్‌ల కోసం పాకిస్తాన్ జట్లను భారత్‌కు రావడానికి అనుమతించింది. BCCI నేరుగా భారత ప్రభుత్వ పరిధిలో లేనప్పటికీ, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడటానికి BCCIకి మార్గం సుగమం అయింది. 

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

ఆసియా కప్ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. వాస్తవానికి, టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆసియా కప్‌ను తటస్థ వేదికపై నిర్వహించడానికి BCCI అంగీకరించింది. ఇప్పుడు టోర్నమెంట్ యూఏఈలో జరుగుతుంది, ఇక్కడ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగుతుంది.