ODI Centuries Record: వన్డే ఫార్మాట్ మొదలుపెట్టాక క్రికెట్ క్రేజ్ పెరిగింది. టీ20 ఫార్మాట్ వచ్చాక మ్యాచ్‌లు త్వరగా ముగియడంతో పాటు క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచుతున్నాయి. కానీ వన్డే క్రికెట్ లో కాస్త నిలకడగా ఆడితేనే పరుగులు సాధ్యం. టీ20 తరహాలో బ్యాట్ ఊపితే కుదరదు. అయితే వన్డేలలో సెంచరీలు చేస్తే ఆటగాళ్లకు వచ్చే మజానే వేరు. జట్టు విజయం కోసం పరుగులు చేయడం ఒక ఎత్తు అయితే, సెంచరీ బాదితే ఆటగాళ్లకు సంతృప్తిగా ఉంటుంది.
వన్డే ఫార్మాట్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత బ్యాటర్ వన్డే క్రికెట్‌లో అత్యధికంగా 51 సెంచరీలు సాధించి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. అతను సెంచరీ చేయడం మాత్రమే కాకుండా, ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.
విరాట్ కోహ్లీ (భారత్) – 51 సెంచరీలు
మ్యాచ్‌లు- 302
పరుగులు- 14,181
అత్యధిక వ్యక్తిగత స్కోరు- 183
విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 51 సెంచరీలు చేశాడు. 2008లో భారత జట్టులోకి అరంగేట్రం చేసినప్పటి పరుగుల దాహంతో రికార్డులు సృష్టించాడు. కీలక మ్యాచ్‌లలో, ముఖ్యంగా ఛేజింగ్ లో పరుగుల సునామీతో శతకాల శతకాల మీద చేసి నెంబర్ వన్ అయ్యాడు. అతని ఫిట్‌నెస్, వికెట్ల మధ్య పరిగెత్తే తీరు.. మ్యాచ్‌లను ముగించే ఇన్నింగ్స్‌లు కోహ్లీని గొప్ప బ్యాట్స్‌మెన్‌గా మార్చాయి.
సచిన్ టెండూల్కర్ (భారత్) – 49 సెంచరీలు
మ్యాచ్‌లు- 463
పరుగులు- 18,426
అత్యధిక వ్యక్తిగత స్కోరు- 200 నాటౌట్
'క్రికెట్ దేవుడు' అని పిలుచుకునే సచిన్ టెండూల్కర్ దాదాపు 2 దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌లో రారాజుగా నిలిచాడు. సచిన్ ఖాతాలో 49 వన్డే సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో 200 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్ సచిన్. ఆ తరువాతే పలువురు బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేశారు..
రోహిత్ శర్మ (భారత్) – 32 సెంచరీలు
మ్యాచ్‌లు- 273
పరుగులు- 11,168
అత్యుత్తమ స్కోరు- 264
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సాధించాడు. ‘హిట్‌మ్యాన్’గా పిలుచుకునే రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ వన్డేల్లో మొత్తం 32 సెంచరీలు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కావడం విశేషం.
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 30 సెంచరీలు
మ్యాచ్‌లు- 375
పరుగులు- 13,704
అత్యుత్తమ స్కోరు- 164
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ఆసీస్ ను చాలాకాలం పాటు నెంబర్ వన్‌గా నిలిపాడు. కెప్టెన్సీతో మాత్రమే కాదు బ్యాట్ తోనూ రికార్డులు సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టుకు రెండు ప్రపంచ కప్‌లను అందించిన కెప్టెన్ పాంటింగ్. తన వన్డే కెరీర్‌లో 30 సెంచరీలు ఉన్నాయి. పాంటింగ్ తన కాలంలో గొప్ప బ్యాటర్, కెప్టెన్‌గానూ నిలిచాడు.
సనత్ జయసూర్య (శ్రీలంక) – 28 సెంచరీలు
మ్యాచ్‌లు- 445
పరుగులు- 13,430
అత్యధిక వ్యక్తిగత స్కోరు- 189
శ్రీలంకకు చెందిన మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య దూకుడు బ్యాటింగ్ తో పవర్‌ప్లే అర్థాన్ని మార్చేశాడు. అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్, ఓపెనర్ బ్యాటర్‌గా జయసూర్య రాణించాడు. తన కెరీర్‌లో జయసూర్య 28 సెంచరీలు చేశాడు. అతడు బంతితోనూ అద్భుతం చేశాడు. పలు మ్యాచ్ లలో తన బౌలింగ్ నైపుణ్యంతో జట్టుకు విజయాలు అందించాడు.