Ind vs eng 5Th Test  Latest Updates: ఇంగ్లాండ్ తో ఈనెల 31 నుంచి లండ‌న్ లోని ద ఓవ‌ల్ మైదానంలో జ‌రిగే ఐదో టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ లెవ‌న్ గురించి చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా జ‌ట్టులో స్టార్ బౌల‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా ఆడ‌తాడా..?  లేదా అనే దానిపై సందిగ్ద‌త నెల‌కొంది. నిజానికి ఈ టెస్టు ప్రారంభానికి ముందే బుమ్రా కేవ‌లం మూడు టెస్టులు మాత్ర‌మే ఆడ‌తాడాని టీమ్ మేనేజ్మెంట్ ప్ర‌క‌టించింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. రెండో టెస్టులో పెవ‌లియ‌న్ కు ప‌రిమిత‌మ‌య్యాడు. మూడు, నాలుగు టెస్టులో త‌ను ఆడాడు. దీంతో త‌న‌కు కేటాయించిన మూడు టెస్టులు ముగిశాయి. అయితే జ‌ట్టు ప్రాధాన్య‌త రిత్యా ఐదో టెస్టులో త‌ను ఆడ‌తాడా... లేదా అన్న దానిపై జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం జ‌ట్టులో పేస‌ర్లంతా ఫిట్ గా ఉన్నార‌ని, అయితే బుమ్రా ఆడ‌టంపై మాత్రం నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పాడు. 

అత్యుత్త‌మ బౌల‌ర్..సిరీస్ లో మూడు టెస్టులే ఆడిన‌ప్ప‌టికీ, బుమ్రా మాత్రం అద‌ర‌గొట్టాడు. టీమిండియా త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు 14 వికెట్ల‌ను కేవ‌లం 26 స‌గ‌టుతో మాత్ర‌మే తీశాడు. ఇందులో రెండుసార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌టం విశేషం. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కూడా బుమ్రా బౌలింగ్ ను ఆచితూచి ఆడుతుండ‌గా, మిగ‌తా వారిపైన మాత్ర విరుచుకుప‌డుతుంది. ఐదో టెస్టుకు సంబంధించి గంభీర్ మాట్లాడుతూ.. త‌మ జ‌ట్లు అనుభ‌వ ర‌హితంగా ఉంద‌ని, అయిన‌ప్ప‌టికీ గొప్ప పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శించింద‌ని కొనియాడాడు. ఇదే స్ఫూర్తితో ఐదో టెస్టును గెలిచి, 2-2తో సిరీస్ ను స‌మం చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు.

జ‌ట్టులో మార్పులు..గంభీర్ మాట‌ల‌ను బ‌ట్టి, ప్లేయింగ్ లెవ‌న్ లో మార్పులు త‌ప్పేలా క‌నిపించేటట్లు లేదు. బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ త‌మంత‌ట తాము త‌ప్పుకుంటే త‌ప్పా, వారు ప్లేయింగ్ లెవ‌న్ లో ఆడ‌తారు. ఒక‌వేళ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ఆడక‌పోయినా, అర్ష‌దీప్ సింగ్ ను ఆడించే అవ‌కాశ‌ముంది.  మూడో పేస‌ర్ గా విఫ‌ల‌మైన అన్షుల్ కాంబోజ్ ను త‌ప్పించి, అత‌ని స్థానంలో ఆకాశ్ దీప్ ను ఆడించ‌వ‌చ్చు. బ్యాటింగ్ లైన‌ప్ లో ఓపెన‌ర్లుగా య‌శ‌స్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆడ‌తారు. మూడోస్తానంలో సాయి సుద‌ర్శన్ కు మ‌రో ఛాన్స్ ద‌క్కుతుంది. నెం.4లో కెప్టెన్ శుభ‌మాన్ గిల్ ఆడ‌తాడు. గాయంతో రిష‌భ్ పంత్ దూరం కావ‌డంతో అత‌ని స్తానంలో ధ్రువ్ జురెల్ ఆడ‌టం ఖాయంగా మారింది. అయితే త‌ను ఏడో నెంబ‌ర్లో బ్యాటింగ్ చేసే అవ‌కాశ‌ముంది. దీంతో ఐదు, ఆరు స్తానాల్లో వ‌రుస‌గా వాషింగ్ట‌న్ సుంద‌ర్, ర‌వీంద్ర జ‌డేజాల‌ను ఆడించే చాన్స్ ఉంది. ఒక‌వేళ వికెట్ స్పిన్ కు అనుకూలిస్తే శార్దూల్ ఠాకూర్ స్తానంలో కుల్దీప్ యాద‌వ్ ను ఆడించొచ్చు. ఏదేమైనా పిచ్ ప‌రిస్థితి, ఆట‌గాళ్ల ల‌భ్య‌త‌ను బ‌ట్టి టీమిండియా మేనేజ్ మెంట్ ఈ విషయంపై తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌ముంది.