Ambati Rayudu:భారత క్రికెట్‌లో రాజకీయాల వల్ల చాలామంది క్రికెటర్ల జీవితాలు చీకట్లోనే మగ్గిపోయాయి.  ఇందుకు తానేమీ అతీతుడిని కాదంటున్నాడు ఆంధ్రాకు చెందిన అంబటి రాయుడు. ఇటీవలే  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న రాయుడు.. ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ కెరీర్‌ను ప్రభావితం చేసిన అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌పై రాయుడు సంచలన ఆరోపణలు చేశాడు. 


రాయుడు మాట్లాడుతూ... ‘నా క్రికెట్ కెరీర్‌లో చిన్నప్పట్నుంచే  రాజకీయాలు మొదలయ్యాయి.  నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు ఆడుతున్నప్పుడే వాటిని ఎదుర్కున్నా.   అర్జున్ యాదవ్ (శివలాల్ యాదవ్ కుమారుడు)  నన్ను  మానసికంగా చాలా హింసించాడు.  నేను అతడి కంటే బాగా ఆడుతున్నా.. నామీద కక్ష గట్టి మరీ నన్ను భారత జట్టుకు  ఎంపికకాకుండా అడ్డుకున్నారు.. 


అప్పటికీ నాకు  17 ఏండ్లు మాత్రమే.  అదే సమయంలో అర్జున్ యాదవ్ కూడా టీమిండియాకు ఆడాలని కలలు కంటున్నాడు.  నేనూ అదే ప్రయత్నాల్లో ఉన్నా. నేను 2003-04లో ఇండియా - ఏ కు మెరుగైన ప్రదర్శనలు చేశా.  కానీ 2004లో  సెలక్షన్ కమిటీ మారింది. శివలాల్ యాదవ్ కు సన్నిహితులు  సెలక్షన్ కమిటీ ప్యానెల్‌లో చేరారు. దాంతో నాకు ఆడే అవకాశమే రాలేదు. నాలుగేండ్ల పాటు నన్ను సెలక్టర్లకు దూరం చేశారు. ఓరోజు శివలాల్ యాదవ్ సోదరుడు ఫుల్లుగా తాగొచ్చి మా ఇంటి ముందు మమ్మల్ని బండ బూతులు తిట్టాడు. వాళ్లు నన్ను మానసికంగా  దెబ్బ తీయాలని చూశారు...’ అని ఆరోపించాడు. 


అండర్ - 19, ఇండియా - ఏ తరఫున  నిలకడగా రాణించిన రాయుడు.. ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు మారాడు. కానీ ఇక్కడ అతడు రాజకీయాల కారణంగా తిరిగి ఆంధ్రాకే  ఆడాడు. 2005-06 రంజీ సీజన్‌లో రాయుడు-అర్జున్ యాదవ్ లు మైదానంలోనే గొడవకు దిగడం గతంలో  సంచలనం  సృష్టించింది. 


కాగా శివలాల్ యాదవ్  భారత్ తరఫున 1979 నుంచి 1987 వరకూ  35 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. ఆట నుంచి తప్పుకున్నాక ఆయన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయ్యాడు. 2014లో ఆయన బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై.. 


హెచ్‌సీఏపై కూడా రాయుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. హెచ్‌సీఏకు గతంలోనే క్యాన్సర్ అంటుకుందని.. ఇప్పుడది  నాలుగో దశకు చేరిందని, దానిని కాపాడటం ఎవరివల్లా కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘హెచ్‌సీఏ‌కు నా చిన్నతనంలోనే క్యాన్సర్ అంటుకుంది. ఇప్పుడు మనం హెచ్‌సీఏ పరిస్థితి చూసి బాధపడటం తప్ప  ఏమీ చేయలేం.  ఇప్పుడు అది నాలుగో దశకు చేరింది. బీసీసీఐ ఏమైనా జోక్యం చేసుకుని బాగు చేస్తే తప్ప హెచ్‌సీఏ పరిస్థితి దారుణంగా ఉంది..’అని  చెప్పాడు. 


ఇటీవలే ముగిసిన  ఐపీఎల్-16 తర్వాత  అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న  రాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు  ప్రచారం జోరుగా సాగుతోంది. అతడు  అధికార వైసీపీ నుంచి గుంటూరు లోని అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగొచ్చన్న ఊహాగానాలూ వస్తున్నాయి. రాయుడు ఇదివరకే ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో రెండుసార్లు భేటీ అవడం గమనార్హం.