Indian Street Premier League T10: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో జట్లను సినిమా దిగ్గజాలు ఒక్కొక్కరిగా కైవసం చేసుకుంటున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)... అక్షయ్ కుమార్(Akshay Kumar)... హృతిక్ రోషన్(Hrithik Roshan)... రామ్‌చరణ్(Ram Charan).. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌తో జట్టు కట్టగా...తాజాగా మరో హీరో సూర్య(Suriya) కూడా చేతులు కలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై(Chennai) జట్టు యాజమాన్య హక్కులను సూర్య కొనుగోలు చేశాడు. చెన్నై జట్టు యాజమాన్య హక్కులను కొనుగోలు చేసినట్లు సూర్యానే స్వయంగా ప్రకటించారు. క్రికెట్ ఔత్సాహికులందరికీ స్వాగతం పలుకుతున్నట్లు సూర్యా ట్వీట్ చేశాడు. అందరం కలిసి క్రీడాస్ఫూర్తిని చాటుదామని.. క్రికెట్ నైపుణ్యాలను ప్రపంచానికి చాటిచెప్దామని ఆ ట్వీట్‌లో సూర్యా పిలుపునిచ్చారు.
రామ్‌చరణ్ కూడా....
ఇండియన్ స్ట్రీట్ ప్రిమియర్ లీగ్ (ISPL)తో టాలీవుడ్ హీరో, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan) కూడా ఇప్పటికే చేతులు కలిపాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లోని హైదరాబాద్ జట్టు(Hyderabad Team) యాజమాన్య హక్కులను రామ్‌చరణ్ కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రతిభవంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి, గల్లీ క్రికెట్‌ను సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని రామ్‌చరణ్ తెలిపాడు. ISPLలో హైదరాబాద్ జట్టుకు యజమానిగా మారినందుకు సంతోషంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రామ్ చరణ్ ప్రకటించాడు. ISPLలో హైదరాబాద్ జట్టును మెరుగుపరుస్తూ.. చిరస్మరణీయమైన క్షణాలను ఆస్వాదించడానికి తనతో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ స్ర్టీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ జట్టుకు రామ్ చరణ్ యజమాని కాగా.. ముంబై జట్టుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ జట్టుకు అక్షయ్ కుమార్, బెంగళూరు జట్టుకు హృతిక్ రోషన్ యజమానులు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ముంబయిలో ఐఎస్‌పీఎల్ జరుగుతుంది.
ఈ లీగ్ ఎలా జరుగుతుందంటే..?
ఇండియన్ స్ట్రీట్ ప్రిమియర్ లీగ్ టీ10 ఫార్మాట్లో జరిగే టెన్నిస్ క్రికెట్ లీగ్. మన దేశంలోని ప్రతిభావంతమైన స్థానిక క్రికెటర్లను వెలుగులోకి తేవడానికి ఇది దోహదపడుతుంది. ఈ లీగ్ ద్వారా యంగ్ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసి.. భావి క్రికెట్ సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దనున్నారు. అదే సమయంలో నగరాల్లో ఆటకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపరుస్తారు. 2024 మార్చి 2 నుంచి 9వ తేదీ వరకు ఐఎస్‌పీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. గల్లీ క్రికెట్‌కు, స్టేడియంలో జరిగే ప్రొఫెషనల్ గేమ్‌కు మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చడానికి ఐఎస్‌పీఎల్ కట్టుబడి ఉంది. గల్లీ క్రికెట్లో సత్తా చాటే యంగ్ అండ్ టాలెంటెడ్ ఆటగాళ్లు తదుపరి దశకు చేరుకోవడానికి ఈ లీగ్ ఉపయోగపడుతుంది. అన్ని రాష్ట్రాల క్రికెటర్లు ఈ లీగ్ సెలక్ష్ ప్రక్రియలో పాల్గొనొచ్చు www.ispl-t10.com వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావడం ద్వారా ఈ లీగ్‌లో మీ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో మీ పేరు, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి రూ.1179 చెల్లించడం ద్వారా మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.