కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పారా టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు రాజ్ అరవిందన్ అళగర్, సోనాల్ బెన్ పటేల్ సెమీస్‌కు చేరుకున్నారు. వీరిలో సోనాల్ బెన్ పటేల్ మహిళల సింగిల్స్ విభాగంలో నైజీరియాకు చెందిన చినెన్యె ఒబియోరాపై విజయం సాధించింది.
మహిళల సింగిల్స్ క్లాస్ 3-5 సింగిల్స్ మ్యాచ్‌లో సోనాల్ బెన్ పటేల్... ఒబియోరాపై 8-11, 11-5, 11-7, 11-5తో విజయం సాధించింది. మొదటి సెట్‌ను సోనాల్ కోల్పోయినా తర్వాత మూడు సెట్లలో విజయం సాధించింది మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో సోనాల్ బెన్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. గ్రూప్-2లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.
మరోవైపు పురుషుల పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ రాజ్ అరవిందన్ అళగర్ కూడా ఇంగ్లండ్‌కు చెందిన డాన్ బుల్లెన్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ క్లాస్ 3-5 మ్యాచ్‌లో రాజ్ అరవిందన్ అళగర్ 11-5, 11-2, 9-11, 11-2తో గెలిచాడు.
మొదటి రెండు గేమ్స్‌లో విజయం సాధించిన రాజ్ అరవిందన్ అళగర్ మూడో గేమ్‌లో తడబడ్డాడు. అయినా వెంటనే తేరుకుని నాలుగో గేమ్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌ను గెలిచాడు. దీంతో సెమీస్‌కు చేరుకున్నాడు.
వీరితో టోక్యో పారాలింపిక్స్‌లో విజయం సాధించిన భవీనా పటేల్ కూడా మహిళల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరుకుంది. ఫిజీకి చెందిన అకనిసి లటుపై తన మూడో మ్యాచ్‌లో భవీనా గెలిచింది. ఈ మ్యాచ్‌లో భవీనా పటేల్ 11-1, 11-5, 11-1తో అకనిసి లటుపై విజయం సాధించింది. వరుస సెట్లలో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన భవీనా సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఇంతకుముందు భవీనా పటేల్ ఆస్ట్రేలియాకు చెందిన డానియేలా డెల్ టోరో, నైజీరియాకు చెందిన ఇఫెచుక్వుడే ఇక్పేఓయ్‌లపై విజయం సాధించింది. సెమీస్ మ్యాచ్ శుక్రవారం జరిగింది. గ్రూప్-1లో తను మొదటి స్థానంలో నిలిచింది. జులై 28వ తేదీన బర్మింగ్‌హాంలో మొదలైన కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టు 8వ తేదీ వరకు జరగనున్నాయి.