AP Death Politics : ఏపీ రాజకీయాలు నిన్నటి దాకా అసభ్యంగా తిట్టుకునే విషయంలో దిగజారిపోతున్నాయని అనుకునేవారు. కానీ ఇప్పుడు కుటుంబాలను కూడా ఇందులోకి లాగేస్తున్నారు. ఏమీ లేకపోయినా ఏదో ఓ ఆరోపణ చేసి రాజకీయం చేసేసుకుంటున్నారు. తాజాగా నందమూరి తారక రామారావు కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో ఏపీలో రాజకీయం మండిపోయింది. వైఎస్ఆర్‌సీపీ నేతలు చంద్రబాబుకు, లోకేష్‌కు ముడిపెట్టి ఆరోపణలు చేయడంతో రాజకీయం ఇలా మారిపోయిందేమిటా అని అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి .
రాజకీయాలపై అసహ్యం పుట్టేలా ఆరోపణలు - ప్రత్యారోపణలు !
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న అంశంపై ఏపీలో జరుగుతున్న రాజకీయం సామాన్యుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఏపీ ప్రభుత్వ అటవీ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి మొదట లోకేష్ టార్గెట్‌గా ట్విట్టర్‌లో ఆరోపణలు చేశారు. ఓ భూమి విషయంలో లోకేష్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని ట్వీట్ చేశారు. దానికి కొన్ని సర్వే నెంబర్లు కూడా పెట్టారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పెట్టిన సర్వే నెంబర్లు కానీ.. అసలు భూమి కానీ లేదని కొంత మంది ఆన్ లైన్‌లో సెర్చే చేసి ఫ్రూప్‌లు పెట్టారు. తర్వాత హెరిటేజ్ విషయంలో ఆరోపణలు చేస్తూ ట్వీట్లు పెట్టారు.
ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అదే ఆరోపణలు !
ఉమామహేశ్వరి ఆత్మహత్యపై కుటంబసభ్యుల్లో ఎలాంటి అనుమానాలు లేవు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించిన తర్వాత ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దింపి.. పోస్టుమార్టంకు తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. కానీ అనుమానించాల్సిన అంశాలున్నాయని వారు చెప్పలేదు. ఎవరూ ఆరోపణలు చేయలేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చంద్రబాబు, లోకేష్‌ల పనేనని ఆరోపణలు ప్రారంభించారు. దీనిపై టీడీపీ నేతలు ప్రతి విమర్శలు చేశారు. ఓ వైపు ఉమామహేశ్వరి అంత్యక్రియలు జరుగుతూంటే.. మరో వైపు లక్ష్మిపార్వతి ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయాల విషయంలో ప్రజలకు మరో అభిప్రాయం ఏర్పడే పరిస్థితి వచ్చింది.
వివేకా హత్య కేసు ఆరోపణలకు కౌంటర్ అంటున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్‌గానే వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు కొంత మంది సమర్థించుకుంటున్నారు. వివేకా హత్య కేసులో మొదట గుండెపోటు అని చెప్పినప్పుడు ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు. చాలా మంది సంతాపాలు తెలియచేశారు. అయితే గుండెపోటు అని ప్రచారం చేసినా అది దారుణ హత్య అని తెలిసిన తర్వాతే రాజకీయం అయింది. తర్వాత నిందితుల్ని కాపాడుతున్నారని ఆరోపణలు రావడం.. వివేకా కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తూండటంతో ఆ అంశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
రాజకీయాల్లో పడిపోతున్న విలువలకు నిదర్శనమా ?
ఎన్టీఆర్ కుటుంబం నుంచి చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ తప్ప ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాల్లో ఎవరూ లేరు. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెల్లో ఒక్క బాలకృష్ణ మాత్రమే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఇతరులెవరూ ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఉమామహేశ్వరి కూడా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. చాలా కాలం అమెరికాలో ఉండి తిరిగి వచ్చారు. అయితే ఇప్పుడు ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేయడం .. రాజకీయాల్లో పడిపోతున్న విలువలకు నిదర్శనమన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.