YSRCP MP Magunta :   వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు ఢిల్లీలో రాజకీయంగా సంచలనం రేపుతున్న మద్యం సిండికేట్ స్కాంలో వినిపిస్తోంది. ఇటీవల ఈ స్కాంపై లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. అయితే ఇందులో తెలుగువారి పేర్లు ఇప్పటి వరకూ బయటకు రాలేదు. కానీ అనూహ్యంగా ఏపీకి చెందిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పేరు ప్రచారంలోకి రావడంతో  తెలుగు రాష్ట్రాల రాజకీయంలోనూ చర్చనీయాంశమవుతోంది. 


ఢిల్లీలో మద్యం పాలసీ మార్చిన కేజ్రీవాల్ సర్కార్ !


ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల మద్యం రపాలసీని మార్చింది. గత ఏడాది నవంబర్ నుంచి  మద్యం విక్రయాల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది.  మద్యం రిటైలర్లు ఒకటి కొంటే మరొక బాటిల్ ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి వచ్చింది.  ఎక్సైజ్ టెండర్ల కేటాయింపు, డిస్కౌంట్లు అందించే ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఆప్ ప్రభుత్వం సుమారుగా రూ.144 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని చెబుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. 


మద్యం టెండర్లను దక్కించుకున్న కంపెనీల్లో మాగుంట కుటుంబ సంస్థలు !


ఢిల్లీ ప్రభుత్వం పిలిచిన టెండర్లలో   మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సంబంధించిన వారి కంపెనీలు కూడా టెండర్లు దాఖలు చేశాయి. కొన్ని చోట్ల టెండర్లను దక్కించుకున్నాయి. మాగుంట కుటుంబానికి లిక్కర్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తూంటారు. మాగుంట అగ్రోఫామ్స్ పేరుతో ఉన్న కంపెనీకి బిడ్డింగ్‌లో టెండర్ దక్కింది. అన్నీ సక్రమంగా జరిగాయని..  అవకతవకలు జరిగాయన్నది వాస్తవం కాదని మాగుంట ప్రతినిధులు చెబుతున్నారు. ఢిల్లీ మద్యం విధానంలో తమకు ఎలాంటి  సంబంధం లేదని చెబుతున్నారు. 


మళ్లీ మద్యం విధానం మార్చేసిన కేజ్రీవాల్ సర్కార్ !


అవినీతి ఆరోపణలు  వెల్లువెత్తడంతో ఢిల్లీ ప్రభుత్వం  తన నిర్ణయాన్ని మార్చుకుంది. 9 నెలల తర్వాత తన మద్యం విధానం వెనక్కి తీసుకుంది. మళ్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్ముతామని ప్రకటించింది.  సెప్టెంబరు 1 నుంచి పాత విధానం అమల్లోకి వస్తుందని చెప్పింది. అయితే మద్యం విధానాన్ని వెనక్కి తీసుకున్నంత మాత్రాన సీబీఐ విచారణ ఆగబోదని.. అక్రమాలకు పాల్పడిన వారిని వదలబోమని బీజేపీ వర్గాలంటున్నాయి. లిక్కర్ టెండర్లు దక్కించుకున్న వారిలో వైఎస్ఆర్‌సీపీ ఉండటంతో ఏపీలోనూ ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.