గత కొన్నిరోజులుగా వినిపిస్తోన్న మాట నిజమేనని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాటల్లో తేలిపోయిందంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ప్రజల కోసమే ఈ రాజీనామా అంటూనే సవాళ్లతో ఉప ఎన్నికకు తెరలేపారు . ఇంతకీ అసలీ బై పోల్‌ ఎవరి కోసం..ఎందుకోసం అన్న మాటలు మరోసారి చర్చకు తావిస్తున్నాయి. గతకొన్నాళ్లుగా రాజకీయపార్టీల్లో సవాళ్ల పర్వం రాజీనామాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దమ్ము.. బలం చూపించడానికే తప్పించి ప్రజల కోసం ఎవరూ రాజీనామాలు చేయడం లేదన్న వాదనలకు మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారమే ఉదాహరణగా నిలిచిందంటున్నారు.


టిడిపి నుంచి కాంగ్రెస్‌ లోకి వచ్చిన రేవంత్ కి పీసీసీ పగ్గాలు అప్పజెప్పడం సీనియర్లలో చాలామందికి నచ్చలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ డైరెక్ట్‌ గానే ఈ వ్యవహారాన్ని పలుమార్లు రాష్ట్ర పెద్దలు, ఢిల్లీ అధిష్టానానికి చెప్పారు. కానీ ఆ మాట నెగ్గకపోవడంతో అవమానంగా ఫీలయ్యారు. ఇదే విషయాన్ని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో రాజగోపాల్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాహుల్‌, సోనియా అంటే గౌరవమని చెబుతూనే వాళ్లు వ్యవహరించిన తీరు, రేవంత్‌ రెడ్డి ప్రవర్తన నచ్చకనే పార్టీని వీడటమే కాదు ఎమ్మెల్యేగానూ రాజీనామా చేస్తున్నానని మనసులోని మాటని మరోసారి బయటపెట్టారు.



మునుగోడు అభివృద్ధి కోసమే ఈ రాజీనామా అన్న రాజగోపాల్ మాటలను ప్రశ్నిస్తూ విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబు దాటేశారు. అంతేకాదు మునుగోడులో మళ్లీ గెలిచేది నేనే అంటూ ప్రజల మద్దతు తనకుందని చెప్పుకొచ్చారు. అటు రాజగోపాల్‌ రాజీనామాపై, ఆయన చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ కూడా గట్టిగానే బదులిచ్చారు. మునుగోడులో మళ్లీ కాంగ్రెస్సే గెలుస్తుందని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకొని తీరుతామని సవాల్‌ విసిరారు. దీంతో ఇప్పుడీ బైపోల్‌ రేవంత్‌ వర్సెస్‌ రాజగోపాల్‌ గా మారింది.


రాజగోపాల్‌ బీజేపీ అభ్యర్థిగా మునుగోడులో దిగితే అప్పుడు ఈ ఎన్నిక కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీగానే మారుతుంది. దీంతో టీఆర్‌ఎస్ లాభం చేకూరే అవకాశం ఉందంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ప్రభుత్వ వ్యతిరేకతను చూపించాలని తాపత్రయ పడుతున్న బీజేపీకి ఈ మునుగోడు ఎన్నిక లాభం చేకూర్చదని చెబుతున్నారు. ఎందుంటే ఇక్కడ పార్టీల కన్నా వ్యక్తుల మధ్య పోరే హెలైట్‌ అవ్వడంతో అధికారపార్టీకి ఎలాంటి నష్టం లేదంటున్నారు.


అసలే టీఆర్‌ఎస్‌ కి ఇక్కడ అంత బలం లేదు. నల్గొండ జిల్లాలోనే సరైన పట్టులేదు. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక వల్ల టీఆర్‌ఎస్‌ కు వచ్చే నష్టం కూడా ఏమీలేదని రేవంత్‌ వర్సెస్‌ రాజగోపాల్‌ సవాళ్లు చెప్పకనే చెప్పేస్తున్నాయి. కారు పార్టీని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఉన్న కాషాయానికి ఈ ఉప ఎన్నిక గెలుపు ఎలాంటి ఫలితమూ ఇవ్వదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


మరోవైపు రేవంత్‌ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత  వచ్చిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ గెలవలేకపోయింది. ఓట్ల శాతాన్ని పెంచుకున్నా కానీ గెలుపు దిశగా మాత్రం రేవంత్‌ పార్టీని నడిపించలేకపోయారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి తన బలమేంటో..దమ్మేంటో చూపించాలని రేవంత్‌ రెడ్డి కసితో ఉన్నట్లు ఆయన వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం.
డబుల్‌ ఆర్‌ సవాళ్లతో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయతెరపై ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.