కృష్ణాజిల్లా రాజకీయాల్లో గుడివాడకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు బలమైన నేతగా ఉంది కొడాలినానినే. వైసీపీలోకి రాకముందు టిడిపికి కంచుకోటగా ఈ నియోజకవర్గాన్ని మార్చింది నానినే. అయితే చంద్రబాబుతో విభేదాల కారణంగా సైకిల్‌ దిగి ఫ్యాన్‌ అందుకున్న కొడాలి నాని తిరుగులేని నేతగా గుడివాడని ఏలేస్తున్నారు. ఇప్పుడలాంటి గుడివాడలో కొడాలికి చెక్‌ పెట్టేందుకు సరైన అభ్యర్థి దొరికారంటున్నారు రాజకీయవిశ్లేషకులు


గత ఎన్నికల్లో ఒక్క సీటు తప్పించి పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయాడు. గెలుపు ముఖ్యం కాదని ఆ పార్టీ సరిపెట్టుకున్నా ఈసారి మాత్రం గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలని చూస్తోంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టే బలమైన అభ్యర్థులను వెతుకుతోంది. అందులో భాగంగా గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసే అభ్యర్థులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వాళ్లెవరో కాదు కొడాలి నాని ముఖ్య అనుచరులని వార్తలు వినిపిస్తున్నాయి.


కొద్దిరోజుల క్రితం పాలంకి సారధిబాబు, మోహన్‌ బాబులిద్దరూ జనసేన పార్టీలో చేరారు. కొడాలి నాని తీరు నచ్చకనే పవన్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు కూడా నోటికి అదుపులేకుండా  టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై దురుసు మాటలతో విమర్శలు చేశారు. దీనిపై పలుమార్లు ఇరుపార్టీలనేతలతో పాటు ఆపార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎలాగైనా సరే కొడాలినానికి గుడివాడలో చెక్‌ పెట్టాలని అప్పటి నుంచి విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. 
ఈక్రమంలో పాలంకి బ్రదర్స్‌ జనసేనలో చేరడంతో ఆపార్టీకి కలిసొచ్చింది. కొడాలినానిపై పోటీచేసేందుకు సరైన అభ్యర్థి పాలంకి బ్రదర్సేనని గట్టిగా నిర్ణయించుకున్నారట. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పాలంకి బ్రదర్స్‌ లో ఒకరు కొడాలిపై పోటీకి దిగనున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.


టీడీపీ కూడా ప్రయత్నాలు


ఇంకోవైపు  తెలుగుదేశం పార్టీ కూడా తిరిగి గుడివాడని దక్కించుకోవాలనుకుంటోంది. అందుకే కొడాలిని ఢీ కొట్టేందుకు వంగవీటి రాధని దింపుతోందని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగుదేశం అభ్యర్ధిగా వంగవీటి , జనసేన అభ్యర్థిగా పాలంకి బ్రదర్స్‌ లో ఒకరు ఈ ఎన్నికల్లో పోటీకి దిగితే  కొడాలి నానికి వచ్చే నష్టం ఏమీలేదంటున్నారు ఆయన వర్గీయులు. 


వంగవీటికి ఆయన సామాజిక వర్గంలోనే బలం లేదని ఇక పాలంకి బ్రదర్స్‌ మాటలను కూడా గుడివాడ ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెబుతున్నారు. ఇంకోవైపు పాలంకి బ్రదర్స్‌ మాత్రం గుడివాడలో కొడాలిని ఓడించి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన చేపట్టిన రోడ్ల దుస్థితి కార్యక్రమంలోనూ , అమలు కాని హామీల గురించి, కొడాలి నాని పని తీరుని జనాల్లోకి తీసుకెళ్లి ప్రచారాలను వీరలెవల్లో చేస్తున్నారని టాక్‌.


మొత్తానికి రాష్ట్ర ఎన్నికల కన్నా గుడివాడ ఎన్నికే పార్టీలకు కీలకంగా మారిందని ప్రస్తుతం రాజకీయవర్గాల్లో వినిపిస్తోన్న హాట్‌ న్యూస్‌.