ఎన్టీఆర్ కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైఎస్‌ఆర్‌సీపీ ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నాయకులు హూ కిల్డ్ పిన్ని అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో ఆ పార్టీ లీడర్ లక్ష్మీపార్వతి మరిన్ని హాట్ కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీకి సానుభూతి తెలుపుతున్నానంటూనే.. ఉమమహేశ్వరి మరణం వెనుక ఏదో ఉందని అన్నారు లక్ష్మీపార్వతి. వైసీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన అమె.. చంద్రబాబు శవ రాజకీయాలు చూశాక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి ఆయనో శనిలా దాపురించారన్నారు. ఎన్టీఆర్ మరణానికి ముందు రోజు సింహగర్జన పేరుతో సభ నిర్వహిస్తామంటే.. అందుకు అడ్డుపడ్డారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు రూపాయి కూడా సాయం అందనివ్వకుండా ప్రయత్నించారని అన్నారు.
ఎన్టీఆర్ కుమార్తె మరణం మిస్టరీగా మారిందన్నారు లక్ష్మీపార్వతి. ఉమామహేశ్వరి మరణం వెనుక ఏదో ఉందని డౌట్ వ్యక్తం చేశారు. చదువుకున్న ఆమె ఆత్మహత్యకు ముందు లెటర్ రాశారని తెలిపారు. చంద్రబాబు వచ్చాక ఆ లెటర్ మాయమైందని వివరించారు. కోడెల మరణాన్ని కూడా వైసీపీ ప్రభుత్వంపైకి తోసేశారని అన్నారు. కోడెల ఫోన్ ఆచూకీ ఇప్పటి వరకు లేదని తెలిపారు. ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబు లేకపోతే వేరే విధంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించుకుని దూరంగా విసిరేశారని అన్నారు.
విజయసాయి రెడ్డి ట్వీట్....
ఎన్టీఆర్ కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయి కూడ ట్విటర్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్యకు పాల్పడటం అంటే నమ్మలేకపోతున్నామన్నారు. ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయని, చంద్రబాబు వేధించారా లేక ఇంకెవరైనా వేధించారా అనే సందేహాలు వెలిబుచ్చారు. ఈ అనుమానాలుపై సీబీఐ విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. అంతే కాదు మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య వ్యవహరాన్ని కూడా విజయ సాయి ప్రస్తావించారు. ఆయనది గుండెపోటు అన్నారని, తరువాత ఉరి వేసుకొని చనిపోయారని చెప్పారంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కోడెల సెల్ ఫోన్ కూడా మాయం చేశారన్నారు. చంద్రబాబుకు దగ్గర వారే ఎందుకు ఇలా చనిపోతున్నారంటూ ట్విట్టర్‌లో ప్రస్తావించారు. నేరుగా లోకేష్ పేరు ప్రస్తావించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు.
అదే స్థాయిలో లోకేష్ కౌంటర్
వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు చేస్తున్న ప్రచారంపై లోకేష్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి అబద్దాలు చెప్పే టైం అయిపోయిందని... ఎవరేంటో ప్రజలకు తెలుసు అన్నారు. ఎన్టిఆర్ కుమార్తె మరణాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసి వైసీపీ లీడర్లు బోల్తా పడ్డారన్నారు.