Privacy Bill :  వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదిచడంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 డిసెంబర్‌ 11న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్‌లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. ప్రజల సమాచార గోప్యతా చట్టానికి సంబంధించిన ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నదని  విపక్షాలు ఆరోపించాయి. 


వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించేలా గతంలో చట్టం


జాతీయ భద్రత, ఇతర కారణాల పేరుతో వ్యక్తుల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడానికి ఈ చట్టం ప్రభుత్వానికి విస్తృత అధికారాలు కల్పిస్తున్నదని విమర్శించాయి.  కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. 


విపక్షాల ఆందోళనలతో జేపీసీకి పంపిన కేంద్రం


వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు అనేక సాంకేతిక, విధానపరమైన సమస్యలను సృష్టిస్తుందని ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే, వ్యక్తుల అనుమతి, డేటా నిల్వకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నాయి. ఇంటర్మీడియటరీ హోదా... ఎవరైనా వినియోగదారుడు సదరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకమైన అంశాలను పోస్టు చేసే వాటికి ఈ సోషల్‌ మీడియా సంస్థ బాధ్యత ఉండదు. 


భారీగా సవరణలు సూచించడంతో బిల్లు ఉపసంహరించాలని నిర్ణయం


దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆనాడు ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు నివేదించారు. 2021 డిసెంబర్‌ 16న ఈ కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది. ఈ బిల్లుకు 81 సవరణలను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. పౌరుల డిజిటల్‌ డేటా రక్షణకు సంబంధించిన ఈ బిల్లును చట్టపరంగా సమీక్షించి కొత్తగా తిరిగి ప్రవేశపెడతామని చెప్పారు.