Komatireddy Venkat Reddy :  సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై తానేమీ స్పందించబోనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ఈడీ సీజ్ చేయడంపై ఢిల్లీలో ఎంపీలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడి పార్టీ మార్పు గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. తన పేరు వెంకటరెడ్డి అని ఏమైనా ఉంటే రాజగోపాల్ రెడ్డినే అడగాలని తేల్చేశారు. తాను నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తనన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌కు సీల్ చేస్తే నిరసన వ్యక్తం చేయడానికి తెలంగాణలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో తాను ఒక్కడినే వచ్చానన్నారు. మిగతా ఎంపీలు ఏమయ్యారని ప్రశ్నించారు. రేవంత్, ఉత్తమ్ ఎందుకు రాలేదన్నారు. తను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని చెప్పుకున్నారు. 


"మీరు"  అని తననూ రేవంత్ విమర్శించాడని  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం


అయితే తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండి పడ్డారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాజగోపాల్ రెడ్డికి బ్రాందీషాపుల్లో కూడా పని దొరకదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇలా విమర్శించడం ఏమిటని వెంకటరెడ్డి ప్రస్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయనను విమర్శించాలి కానీ.. రేవంత్ కుటుంబాన్ని విమర్శించారని మండిపడ్డారు. మీరు అని అని రేవంత్ రెడ్డి అన్నారని..అలా అనడం వల్ల కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లయిందని కోమటిరెడ్డి చెబుతున్నారు. 


రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ 


రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.  అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రకటించారు. తనను అనవసరంగా రెచ్చగొట్టవద్దని..  తాను ఒక్క మాట కూడా పడనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే అది చేస్తానని...కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాము కష్టపడి కాంట్రాక్టులు  చేసి సంపాదించుకున్నామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో పని చేసే సమయానికి రేవంత్ రెడ్డి పుట్టలేదన్నారు. 


సోదరుడి తరహాలో రేవంత్‌ను టార్గెట్ చేయడంపై కాంగ్రెస్‌లో చర్చ


సోదరుడు పార్టీకి రాజీనామాపై వెంకటరెడ్డి ఎలా స్పందిస్తారన్నదానిపై కాంగ్రెస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ ఉత్కంఠ ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో తనకు సంబంధం లేదన్నట్లుగా వెంకటరెడ్డి స్పందించారు. తాను మాత్రం కాంగ్రెస్‌కు బద్దుడిగా ఉంటానని చెప్పారు. కానీ ఆయన "మీరు" అనే చిన్న పదాన్ని పట్టుకుని చాలా అర్థం తీసుకుని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడటం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్‌నే టార్గెట్ చేసి పార్టీకి రాజీనామా చేశారు.