Tummala : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ను సీనియర్లు టెన్షన్ పెడుతున్నారు. సీనియర్ నేతలంతా టీఆర్ఎస్‌లోనే ఉండటంతో వచ్చే ఎన్నికల్లో అందరికీ సర్దుబాటు చేయడం అసాధ్యంగా మారింది. దీంతో కొంత మంది పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి వారిలో మొదటగా తుమ్మల నాగేశ్వరరావు పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. తాజాగా ఆయన కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు కూడా దానికి తోడయ్యాయి.
పార్టీ మార్పుపై సంకేతాలిస్తున్న తుమ్మల
పాలేరులో కార్యకర్తలతో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు ఏ క్షణమైన పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది.. కార్యకర్తలు సిద్దంగా ఉండాలని చెసూచించారు. దీంతో ఆయన పార్టీ మారుతారా..? అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అవసరమైతే పార్టీ మారి అక్కడ నుంచి తప్పనిసరిగా పోటీ చేయాలని దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం రాజకీయాల్లో తుమ్మలది కీలక పాత్ర
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు తనదైన ముద్ర వేసుకున్నారు. టీడీపీతో రాజకీయ అరంగ్రేటం చేసిన ఆయన సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలను కలిగి ఉన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల ఓటమి పాలయ్యారు. కేసీఆర్‌తో ఉన్న సానిహిత్యం మేరకు గులాభీ కండువా కప్పుకోవడంతోపాటు ఆయనను ఎమ్మెల్సీగా నియమించి కేసీఆర్ తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. ఆ తర్వాత 2015లో రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరుకు ఉప ఎన్నిక రావడంతో అక్కడ్నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
పాలేరు టిక్కెట్ కందాల ఉపేందర్ రెడ్డికే ఇస్తే తమ్ముల పార్టీ మార్పు ?
పాలేరు నుంచి విజయం సాదించిన కందాల ఉపేందర్‌రెడ్డి ఆ తర్వాత పరిణామాల క్రమంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల్లో తుమ్మల అనుచరులు అధికంగా ఉండటంతో కొత్త, పాత కలయిక నేపథ్యంలో వర్గపోరు మొదలైంది. గత రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు అంతగా పట్టించుకోని తుమ్మల ఇటీవల కాలంలో దూకుడు పెంచారు. తరుచూ పాలేరు నియోజకవర్గంలో పర్యటించడంతోపాటు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, వచ్చే ఎన్నికల్లో తాను తప్పక పోటీ చేస్తానని, అందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిస్తుండటంతో పార్టీ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న తుమ్మల పార్టీ మారరని, పాలేరు నుంచి టీఆర్‌ఎస్ టిక్కెట్ ఆయనకే లబిస్తుందని కార్యకర్తలు నమ్మకంగా చెబుతున్నారు.
పార్టీ మారితే బీజేపీలోకా ? కాంగ్రెస్‌లోకా ?
ఆయన ఒకవేళ పార్టీ మారితే కాంగ్రేస్‌లోకి వెళతారా..? బీజేపీలోకి వెళతారా..? అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇటీవల బీజేపీ నాయకులు సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓమాజీ మంత్రి, ఓ మాజీ ఎంపీ తమ పార్టీలోకి వస్తారని ప్రచారం చేయడం చూస్తే మరి తుమ్మల బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాట్‌పాం సిద్దం చేసుకున్నాడా..? అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుదీర్ఘ అనుభవం కలిగిన తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారితే టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఇంతకీ నిజంగానే తుమ్మల పార్టీ మారుతారా..? లేదా..? అనే విషయంపైనే ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. తుమ్మలను బుజ్జగిస్తారా..? లేదా అనే విషయం వేచి చూడాల్సిందే.