YS Jagan Meetings :  ముఖ్యమంత్రి బిజీగా ఉన్న జగన్ మూడేళ్ల కాలంలో పార్టీపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. పార్టీ క్యాడర్‌తో ఆయనకు సంబంధాలు తగ్గిపోయాయి. పాదయాత్రలో ఉన్నప్పుడు.. విపక్షంలో ఉన్నప్పుడు  నేరుగా కార్యకర్తలతో.. ద్వితీయ శ్రేణి నేతలతో సంబంధాలు ఉండేవి. కానీ సీఎం అయిన తర్వాత అధికార బాధ్యతల వల్ల ఎమ్మెల్యేలకే సమయం కేటాయించలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి క్యాడర్ ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. కుప్పం నుంచే ప్రారంభిస్తున్నారు. 


కుప్పం నుంచి ప్రారంభం - ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది నేతలు ! 


ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది ముఖ్య నేతల్ని పిలిపించి జగన్  సమావేశాలు నిర్వహిసున్నారు. కుప్పం నుంచి ప్రారంభించారు. అయితే అన్ని నియోజకవర్గాల నేతలతోనూ ఇలా సమావేశం కావడం సాధ్యం కాదు.  ప్రతీ రోజూ ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష పెట్టినా ఆరు నెలల పాటు నిర్విరామంగా నిర్వహించాల్సి ఉంటుంది. అది సాధ్యమా అంటే… ఎవరికైనా కాదనే అనిపిస్తుంది. ఓ వైపు పార్టీ నేతల్ని గడప గడపకూ వెళ్తున్నారు.  మధ్యలో అధికారిక పనులు చాలా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే… నియోజకవర్గాల సమీక్షలు అనేది జగన్‌ ప్రారంభించగలరు కానీ పూర్తి చేయలేరని అనుకోవచ్చు. కానీ ముఖ్యమైన నియోజకవర్గాల కార్యకర్తలతో  మాత్రం సమావేశాలు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. 


ఎన్నికలకు సన్నద్ధం చేసే యోచనలో సీఎం జగన్ !


సీఎం జగన్ తమ పార్టీని ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను గడప గడపకూ పంపుతున్నారు. ఇప్పుడు క్యాడర్‌ను కూడా సిద్దం చేసేందుకు సమావేశాల ప్రారంభిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు మేలు జరుగుతుందని పార్టీ నేతలు ఆశ పడుతూ ఉండటం సహజం. అయితే చాలా మంది పార్టీ నేతలు ఇలా పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారని.. వారిలో అసంతృప్తి ఉందని..  వైఎస్ఆర్‌సీపీ నేతలు చాలా సార్లు చెప్పారు. పలు సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమస్యలన్నీ పరిష్కరించి మళ్లీ వారిని ఎన్నికలకు జగన్ సిద్దం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.  


కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నం !


పార్టీ క్యాడర్‌లో అధినేతను కలవాలనే ఆసక్తి ఉంటుంది. అధినేత చెప్పడం వేరు.. అధినేత చెప్పినట్లుగా మధ్యవర్తులు చెప్పడం వేరు. ద్వితీయ శ్రేణి నేతలు అధినేతను కలవాలనే అుకుంటారు. కరోనా కావచ్చు..  బిజీ షెడ్యూల్ కావొచ్చు.. చాలా మందిని జగన్ కలవలేకపోతున్నారు. ఇప్పుడు ప్రత్యేక భేటీల ద్వారా వారితో భేటీ అయి.. తాను దగ్గరగానే ఉంటానని చెప్పాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి తొలగించి గతంలోలా గెలుపు కోసం పని చేసేలా చేయగలిగితే మళ్లీ విజయం ఖాయమని జగన్ భావిస్తున్నారు.