కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ సత్తా చాటుతోంది. మనకు కచ్చితంగా పతకాలు తీసుకొచ్చే వెయిట్ లిఫ్టింగ్‌లో భారత పవర్ లిఫ్టర్లు దేశ ప్రజల ఆశల్ని వమ్ము చేయలేదు. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4 పతకాలను దేశానికి అందించారు. మీరాబాయి చాను మరో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్నంతో మెరిసింది. దేశానికే చెందిన ఇతర వెయిట్ లిఫ్టర్స్ సంకేత్‌ రజతం, బింద్యారాణి రజతం, గురురాజ పూజారి కాంస్య పతకం అందుకున్నారు. 


కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ ఎక్కడంటే..
ఈ ఏడాది మొదలైన కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల బోణీ కొట్టింది. వెయిట్ లిఫ్టర్లు దేశం పేరు నిలబెడుతూ పతకాల మోత మోగించారు. భారత్ శనివారం ఓ స్వర్ణంతో పాటు 2 రజతాలు, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దాంతో మొత్తం 4 పతకాలు సాధించిన భారత్ కామన్వెల్త్ గేమ్స్ 2022 పతకాల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. మలేషియా, బెర్ముడా, నైజీరియాలు సైతం పతకాల పట్టికలో టాప్ 10లో నిలిచాయి.






టాప్ 10 దేశాలు.. 



  • ఆస్ట్రేలియా 13 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్య పతకాలు (మొత్తం 32)తో అగ్ర స్థానంలో నిలిచింది.

  • న్యూజిలాండ్ 7 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు (మొత్తం 13)తో రెండో స్థానంలో ఉంది.

  • ఇంగ్లాండ్ 5 స్వర్ణాలు, 12 రజతాలు, 4 కాంస్య పతకాలు (మొత్తం 21)తో మూడో స్థానంలో నిలిచింది.

  • కెనడా 3 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు (మొత్తం 11)తో 4వ స్థానంలో ఉంది

  • స్కాట్లాండ్ 2 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్య పతకాలు (మొత్తం 12)తో 5 స్థానంలో నిలిచి, టాప్ 5లో చోటు దక్కించుకుంది.

  • మలేషియా 2 స్వర్ణాలు, 1 కాంస్య పతకాలు (మొత్తం 3)తో 6వ స్థానంలో నిలిచింది.

  • దక్షిణాఫ్రికా 2 స్వర్ణాలు (మొత్తం 2)తో 7వ స్థానంలో నిలిచింది.

  • భారత్ 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్య పతకాలు (మొత్తం 4)తో 8వ స్థానంలో నిలిచింది.

  • బెర్ముడా 1 స్వర్ణం (మొత్తం 1)తో 9వ స్థానంలో నిలిచింది.

  • నైజీరియా 1 స్వర్ణం (మొత్తం 1)తో 10వ స్థానంలో ఉంది.


కామన్వెల్త్‌లో భారత్ సాధించిన పతకాలు.. 
వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల 49 కేజీల విభాగంలో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణం సాధించింది. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్‌ రజతం, మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్య పతకం అందుకున్నారు.