Panchayath Secretary Death Mystery: ‘‘నా తల్లి చావుకు కారణమైన వారిని శిక్షించండి.. మాకు న్యాయం జరిగేలా చూడండి సార్..’’ అంటూ ఆ చిన్నారులు ఎస్టీ కమిషన్ చైర్మన్ వద్ద మొరపెట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవాని భర్త, ఆమె కుటుంబ సభ్యులను ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పరామర్శించిన నేపథ్యంలో దళిత, ప్రజా సంఘ నాయకులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వేధింపులకు గురిచేసిన ఉప్పల గుప్తం మండలం ఎంపీపీ భర్త, వైసీపీ నాయకుడు దంగేటి రాంబాబును శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ ఆత్మహత్య కేసు వెనుక స్థానిక ఎంపీపీ భర్త దంగేటి రాంబాబు వేధింపులు ఉన్నాయని వామపక్షాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉదృతం చేస్తున్నాయి. భవానీ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే రాష్ట్ర ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు మృతురాలు భవానీ కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ సంఘటనపై విచారణ చేశారు. ఉన్నత విద్యను చదువుకున్న భవానీ ఆత్మహత్మ చేసుకునేంత పిరికిది కాదని, దీని వెనుక ఎంపీపీ భర్త, వైసీపీ నాయకుడు దంగేటి రాంబాబు వేధింపులే ఉన్నాయని, అయితే పోలీసులు కేసును పక్కదోవ పట్టించి ప్రధాన నిందితున్ని తప్పించే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. వెంటనే ఏ1 గా దంగేటి రాంబాబును చేర్చి కేసు నమోదు చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రవిబాబుకు ఫిర్యాదు చేశారు.
ఏ స్థాయి వ్యక్తులైనా చర్యలు తప్పవు..
పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ ఆత్మహత్మకు సంబంధించి విచారణ చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రవిబాబు తెలిపారు. ఇటువంటి సంఘటనల పూర్తిగా నిర్మూలించి ఆత్మహత్యకు పురికొల్పిన సంఘటనపై పూర్వపరాలను విచారణ చేపడతామని, అవరమైతే ఏ స్థాయి పోలీసు అధికారి తప్పుచేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అవసరమైతే ముఖ్యమంత్రి, డీజీపీతో మాట్లాడి భవానీ చావుకు కారణమైనటువంటి ప్రతీ వ్యక్తిని బయటకు లాగుతామని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులేం తేల్చారంటే
రొడ్డా భవానీ ఆత్మహత్మ సంఘటనకు సంబందించి ఇటీవలే కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దంగేటి రాంబాబు పాత్ర లేదని తేల్చిచెప్పారు. భవాని తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యిందని, దీంతోపాటు కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగుల బదిలీకు సంబందించి ఇద్దరు వ్యక్తులు భవానీ నుంచి కొంత మొత్తంలో డబ్బును తీసుకున్నారని వివరించారు. వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. అయితే దళిత, ప్రజా సంఘాలు మాత్రం ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు దంగేటి రాంబాబును తప్పించారని, అతని వేధింపుల వల్లనే భవానీ ఆత్మహత్యకు పాల్పడిందని, రాంబాబును ఏ - 1గా చేర్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.