Viral News: మనం ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా, అలాగే చదువుకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకున్నా గూగుల్ తల్లిని అడగాల్సిందే. గూగుల్ తల్లి దగ్గర దొరకని అంశం అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. అదో సమాచార సముద్రం. ఏది నేర్చుకోవాలన్నా గూగుల్ మీకు సహాయం చేస్తుంది. బోర్ కొడుతుంది ఏం చేద్దామని అడిగినా.. ఏమేం చేయాలో చెబుతుంది గూగుల్ తల్లి. యూట్యూబ్ కూడా అంతే. నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి అదో విజ్ఞాన భాండాగారం. అన్ని అంశాలపైనా అందులో వీడియోలు దొరుకుతాయి. ఏదైనా కొంతం విషయం నేర్చుకోవాలంటే గూగుల్, లేదా యూట్యూబ్ లో వెతికితే చాలా సమాచారం వస్తుంది. ఆ  సమాచారాన్ని ఎలా వాడాలన్నది వ్యక్తులను బట్టి మారుతుంది. 


సమాచార సముద్రాలు..


గూగుల్, యూట్యూబ్ ప్రస్తుతం చాలా మందికి అందుబాటులో ఉన్నాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏది వెతికినా దాని గురించి సమాచారం దొరుకుతుంది. గూగుల్ లో సమాచారం వెతకడం కూడా ఓ కళ. ఈ మధ్య కాలంలోల ఆ కళను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. యూట్యూబ్ లో చాలా సమాచారం నిక్షిప్తమై ఉంది. దాదాపు ప్రతి అంశంపై అందులో వీడియోలు లభ్యం అవుతాయి.  ఈ సమాచార భాండాగారాలను వాడుకుని ఇప్పుడు ఓ బాలుడు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. 


బాలుడు ఏం చేశాడంటే..?


కేరళకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు మద్యం తయారు చేశాడు. అదేంటి 12 ఏళ్ల బాలుడికి మద్యం తయారు చేయడం ఎలా వచ్చు అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది సాంకేతిక యుగం. ఇక్కడ పెద్ద వారి కంటే చిన్నపిల్లలే స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. ఆ 12 ఏళ్ల బాలుడు కూడా అలాగే ఆలోచించాడు. యూట్యూబ్ లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారు చేశాడు.  


కల్తీ మద్యాన్ని తాగిన మరో బాలుడు


ద్రాక్ష పండ్ల నుండి తయారు చేసిన మద్యాన్ని మరో బాలుడు తాగాడు.  కల్తీ మద్యం తాగడంతో ఆ బాలుడు కాసేపటికే అస్వస్థతకు గురి అయ్యాడు. వాంతులు చేసుకుని ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చిరాయింకీజులో శుక్రవారం జరిగింది.  కల్తీ మద్యం తాగిన ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రి నుండి డిశ్చార్జీ అయ్యాడని పోలీసులు తెలిపారు. వైన్ బాటిల్ ను స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. అయితే బాలుడు తయారు చేసిన మద్యంలో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేవైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు అధికారులు. 


తల్లిదండ్రులు తెచ్చిన ద్రాక్ష పండ్లతోనే.. 


తల్లిదండ్రులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చిన ద్రాక్ష పండ్లతోనే బాలుడు మద్యం తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.  ద్రాక్ష రసంలో ఏ రసాయనాలు కలపలేదని బాలుడు చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. ద్రాక్ష రసం తయారు చేసి కొన్ని గంటలు భూమిలో పాతి పెట్టినటలు వివరించారు.  ఆ తర్వాత మిత్రుడికి ఇచ్చానని చెప్పాడు.