Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లర్లు ఉడుం పట్టు పడుతున్నారు! స్వర్ణ పతకాలు ముద్దాడేందుకు రెడీ అయ్యారు. ఏకంగా నలుగురు భారత రెజ్లర్లు తమ తమ విభాగాల్లో ఫైనల్‌ చేరుకున్నారు. దీపక్‌ పునియా, బజరంగ్‌ పునియా, సాక్షి మలిక్‌, అన్షు మలిక్‌ బంగారు పతకాల కోసం నేటి అర్ధరాత్రి పోటీ పడనున్నారు. మరో ఇద్దరు కంచు మోగించేందుకు సిద్ధంగా ఉన్నారు.




దీపక్‌ పునియా జోరు


పురుషుల 86 కిలోల కుస్తీ పోటీలో దీపక్‌ పునియా ఫైనల్‌ చేరుకున్నాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ రెజ్లర్‌ అలెక్స్‌ మూర్‌ను 3-1 తేడాతో ఓడించాడు. అంతకు ముందు క్వార్టర్‌ ఫైనల్లో దుమ్మురేపాడు. సియెర్రా లియోన్‌ ఆటగాడు షేకు కసెగ్‌బామను 1.23 నిమిషాల్లో చిత్తు చేశాడు. టెక్నికల్‌ సుపీరియారిటీతో విజయం సాధించాడు.




బజరంగ్‌ పునియా హోరు


పురుషుల 65 కిలోల విభాగంలో బజరంగ్‌ పునియా తుది పోరుకు అర్హత సాధించాడు. కీలకమైన సెమీస్‌లో ఇంగ్లాండ్ రెజ్లర్‌ జార్జ్‌ రామ్‌ను కేవలం 1.31 నిమిషాల్లో చిత్తు చేశాడు. టెక్నికల్‌ సూపరియారిటీతో విజయం అందుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో విక్టరీ బై పాల్‌ పద్ధతిలో బాండౌవ్‌ను ఓడించాడు. కేవలం 1 నిమిషంలోనే ప్రత్యర్థిని కిందపడేశాడు.




సాక్షి బంగారం ఖాయం చేసేనా?


రెండుసార్లు కామన్వెల్త్‌, ఒకసారి ఒలింపిక్స్‌ పతక విజేత సాక్షి మలిక్‌ మహిళల 62 కిలోల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో బెర్త్‌ ఎమిలియెన్‌ ఇటాన్‌ గోలెను ఓడించింది. టెక్నికల్‌ సుపీరియారిటీతో ప్రత్యర్థిని 1.2 నిమిషాల్లోనే చిత్తు చేసింది.




అన్షుకు కఠిన ప్రత్యర్థి


మహిళల 57 కిలోల విభాగంలో అన్షు మలిక్‌ స్వర్ణ పోరుకు అర్హత సాధించింది. శ్రీలంక కుస్తీనారి నెథ్‌మి పొరుతోటగెను కేవలం 1.4 నిమిషాల్లోనే ఓడించింది. టెక్నికల్‌ సుపీరియారిటీతో విజయం అందుకుంది. తుది పోరులో ఆమె మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, డిఫెండింగ్‌ విజేత అడ్కెయూరోయితో తలపడనుంది.




వీరిద్దరికీ కాంస్య పోరు


మోహిత్‌ గ్రేవల్‌, దివ్య కాకరన్ తమ విభాగాల్లో కాంస్యం కోసం పోరాడనున్నారు. వీరిద్దరూ ఓటమి పాలవ్వడంతో రెపిచేజ్‌ పోరులో తలపడనున్నారు.