Mamata Banerjee: 


భవిష్యత్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న టీఎమ్‌సీ


తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. నాలుగు రోజుల దిల్లీ పర్యటనలో ఉన్న ఆమె, అధికారిక నివాసంలో ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని స్థితిగతులతో పాటు జీఎస్‌టీ బకాయిల చెల్లింపుల విషయంపైనా ప్రధానితో చర్చిస్తారని తెలుస్తోంది. ఆగస్టు 7వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు దీదీ. గతేడాది ఈ సమావేశానికి 
హాజరు కాని మమతా, ఈ సారి అటెండ్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు దీదీ. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తమ వ్యూహాలపై చర్చించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనే అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు. "మమతా బెనర్జీ అందరు ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ సెషన్స్, 2024 ఎన్నికలతో పాటు మరి కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. భవిష్యత్ ప్రణాళికలనూ నిర్ణయించాం. ప్రజాసేవకు మేమెప్పుడూ కట్టుబడే ఉంటాం" అని ట్వీట్ చేసింది ఆల్‌ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ AITMC.కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ కానున్నారు దీదీ. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఎస్‌సీ స్కామ్‌ సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీని, మమతా బెనర్జీ కలుసుకోవటం ప్రాధాన్యతసంతరించుకుంది.