Visakha Railway Zone : విశాఖ రైల్వే జోన్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు  కేంద్రాన్ని అభ్యర్థించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమైన ఎంపీ జీవీఎల్ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్‌సీఓఆర్) అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే నిర్మించేందుకు భూమి, నిధుల విడుదలపై రైల్వే మంత్రి హామీ ఇచ్చారని జీవీఎల్ తెలిపారు. విశాఖవాసుల కలల ప్రాజెక్టుగా మంజూరైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పార్లమెంట్‌లో రైల్వే మంత్రి  అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఎంపీ జీవీఎల్ అభ్యర్థించారు. కొత్త రైల్వే జోన్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఎంపీ జీవీఎల్‌ కేంద్ర మంత్రితో తెలిపారు. 


విశాఖ వాసుల కల త్వరలో సాకారం 


విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి భూమి, నిధులు రెండూ అందుబాటులో ఉన్నాయని రైల్వే మంత్రి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుకు హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ కొత్త జోన్‌కు రూపశిల్పి అని, ఆయనే SCoR జోనల్ హెడ్‌క్వార్టర్స్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు త్వరలో శంకుస్థాపన చేయించాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు రైల్వే మంత్రిని కోరారు. భవిష్యత్‌లో ప్రధాని ఏపీలో ఎలాంటి పర్యటనలు చేస్తారో నిర్ధారించిన తర్వాత అభ్యర్థన చేస్తానని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. రైల్వే మంత్రితో జరిగిన సమావేశంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంతోషం వ్యక్తం చేస్తూ, రైల్వేజోన్‌ను త్వరగా ప్రారంభించేందుకు రైల్వే మంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేకించి విశాఖపట్నం ప్రజల కల త్వరలో సాకారం కానుందని జీవీఎల్ తెలిపారు. 


విశాఖలో ప్రధాని మోదీ పర్యటన


విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను రూ.400 కోట్లతో ఆధునీకరించే ప్రాజెక్టు, IIM విశాఖపట్నం మొదటి దశ ఆధునిక క్యాంపస్, రూ.22,000 కోట్ల HPCL విస్తరణ, ఆధునీకరణ ప్రాజెక్ట్‌తో పాటు క్రూయిస్ టెర్మినల్, మెగా ఫిషింగ్ హార్బర్ మొదలైన అనేక ఇతర ప్రాజెక్టులను విశాఖ రైల్వే జోన్‌  శంకుస్థాపనతోపాటు ప్రారంభం చేసేందుకు త్వరలో విశాఖలో ప్రధాని మోదీ పర్యటించాలని తాను స్వయంగా కోరతానని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. విశాఖపట్నంలో కనిపించే అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల వల్లే జరిగిందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఎంపీ జీవీఎల్ తెలిపారు.