Paytm App Down: ఏదైనా అవసరం కోసం ఉదయాన్నే పేటీఎం ఓపెన్ చేశారా? యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటే అవ్వలేదా? అకస్మాత్తుగా యాప్ లాగౌట్ అయిందా? తిరిగి లాగిన్ చేయడానికి ఇబ్బంది పడ్డారా? పేటీఎం మనీ యాప్ ఓపెన్ చేస్తుంటే పేటీఎం పాస్‌వర్డ్ ఎంటర్ చేయమని అడిగిందా? అయితే ఈ సమస్యల్ని ఎదుర్కొంది మీరొక్కరే కాదు! దేశవ్యాప్తంగా చాలామంది యూజర్లు ఇవే ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే!
సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం పేటీఎం సేవలకు అంతరాయం కలిగింది. యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తూ వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. అకౌంట్ దానంతట అదే లాగౌట్ అయిందని కంపెనీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు సైతం బదిలీ అవ్వలేదని పేర్కొన్నారు. పేటీఎం కస్టమర్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కంపెనీ వివరణ ఇవ్వక తప్పలేదు.
నెట్‌వర్క్ ఎర్రర్
యాప్‌లో నెట్‌వర్క్ తప్పిందం వల్ల సాంకేతిక సమస్య ఎదురైనట్టు పేటీఎం తెలిపింది. చాలామంది యూజర్లు లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొంది. చెల్లింపులు చేయలేకపోయారని వివరించింది. 'పేటీఎం యాప్‌లో నెట్‌వర్క్ ఎర్రర్ వల్లే పేటీఎం మనీ యాప్ లేదా వెబ్‌సైట్ లాగిన్ అయ్యేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ సాంకేతిక సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కాగానే అప్‌డేట్ చేస్తాం' అని పేటీఎం తెలిపింది.
డౌన్ డిటెక్టర్ ధ్రువీకరణ
పేటీఎం యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతిని డౌన్ డిటెక్టర్ సైతం ధ్రువీకరించింది. ముబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో సమస్య ఎక్కువగా ఉందని వివరించింది. శుక్రవారం ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య సమస్య తీవ్రత ఎక్కువగా కనిపించిందని వెల్లడించింది.
ఫిర్యాదుల వెల్లువ
'పేటీఎం మనీ పనిచేయకపోవడం వల్ల చాలా డబ్బు నష్టపోయాను. నేను కొనుగోలు చేసిన స్టాక్ రోజువారీ గరిష్ఠ స్థాయిని చేరుకొంది. సాంకేతిక సమస్య వల్ల అమ్మలేకపోయాను' అని ఓ యూజర్ ఫిర్యాదు చేశారు. 'చాలా సేపటి నుంచి పేటీం యాప్ డౌన్ అయింది' అని మరొకరు అన్నారు. 'పేటీఎం మనీలో సమస్యల వల్ల మేం నష్టాలను ఎదుర్కొంటున్నాం. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. వారి లైసెన్స్ రద్దు చేయాలి' అని ఒక యూజర్ పేర్కొన్నారు.