Rahul Gandhi PC Highlights: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ నియంతలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా ప్రజలు నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దిల్లీలో శుక్రవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ.
ప్రజాస్వామ్యం చచ్చిపోతుంటే మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో శతాబ్దాలుగా ఇటుక ఇటుక పేర్చుకుంటూ మనం నిర్మించుకున్న దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేసేస్తున్నారు. ఈ నియంత రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడిన వారిపై దాడులు చేస్తున్నారు. జైలుకు పంపుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింసకు వ్యతిరేకంగా మాట్లాడకుండా విపక్షాల గళం నొక్కడమే వారి ఆలోచన. కేవలం నలుగురు, ఐదుగురు ప్రయోజనాలను కాపాడటం కోసం ఇద్దరు ముగ్గురు వ్యాపారుల సంక్షేమం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. పోరాడుతూనే ఉంటాను. నేను ఎంత పోరాడితే వాళ్లు నాపై అంతలా దాడి చేస్తారు. నాపై దాడి చేయండి. నేను సంతోషంగా స్వీకరిస్తాను. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
144 సెక్షన్
దిల్లీలో పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డా.ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్, 7 లోక్ కల్యాణ్ మార్గ్ సహా పలు ప్రాంతాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా పలు సమస్యలపై కాంగ్రెస్ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చింది. దీంతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు సహా సీనియర్ లీడర్లు ప్రధాని నివాసాన్ని ముట్టడించాలని నిర్ణయించారు.
Also Read: Bike Pillion Riders: అక్కడ బైక్ వెనుక సీట్లో మగవారు కూర్చోవడంపై నిషేధం, అంతలోనే మరో ప్రకటన!