RBI Monetary Policy:
అంచనాలకు మించిన వడ్డింపు
అనుకున్నదే జరిగింది. అంచనాలకు మించి వడ్డీలను వడ్డించింది ఆర్‌బీఐ. అనూహ్య స్థాయిలో రెపో రేట్ పెంచేసింది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీని 50 బేస్ పాయింట్ల మేర పెంచింది. ప్రస్తుతం ఈ పెంపుతో వడ్డీ రేటు 5.40 శాతానికి చేరుకుంది. నిజానికి పరిశ్రమ వర్గాలు 35 బేస్ పాయింట్లు పెంచుతారని భావించాయి. కానీ...అంత కన్నా ఎక్కువే పెంచింది RBI.కొవిడ్ సంక్షోభం తలెత్తాక, ఇలా రెపో రేట్లు పెంచటం వరసగా మూడోసారి. ఇప్పటికే బ్యాంకులు ఈ వడ్డీభారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఇప్పుడు మరోసారి రెపో రేట్ పెంచటం వల్ల సామాన్యులపై ఇంకా భారం పెరగనుంది. మే నెలలో ఇదే విధంగా అనూహ్య స్థాయిలో 40 బేస్ పాయింట్లు పెంచింది RBI.అంతటితో ఆగకుండా జులైలోనూ ఓ సమీక్ష నిర్వహించి ఏకంగా మరో 50 పాయింట్లు పెంచింది. ఇప్పుడు మళ్లీ 50 బేస్ పాయింట్లు వడ్డించింది. ఈ వడ్డీ రేట్లను వెంటనే అమల్లోకి తీసుకురానున్నాయి బ్యాంకులు. ఫలితంగా హోమ్ లోన్స్, వెహికిల్ లోన్స్ సహా ఇతర రుణాలపై వడ్డీ భారం పెరగనుంది. నెలవారీ కట్టే EMIలు పెరగనున్నాయి.
ద్రవ్యోల్బణ రేటు అంచనాలివే..
దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు RBI ఎలాంటి చర్యలు చేపడుతుందో అని అంతా ఎదురు చూశారు. అయితే... సర్దుబాటు విధానానికే మొగ్గు చూపింది ఈ సంస్థ. అంటే వడ్డీ రేట్లు పెంచటం అన్నమాట. తద్వారా కొంత వరకూ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయొచ్చని భావిస్తోంది. ఇదే విషయాన్ని జులైలో సమావేశం జరిగిన తరవాత ప్రకటించారు RBI గవర్నర్ శక్తికాంత దాస్. మళ్లీ వడ్డీల వడ్డింపు తప్పదని అప్పుడే సంకేతాలిచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ రేటుని 6.7%గా అంచనా వేసిన ఆర్‌బీఐ, వృద్ధి రేటుని 7.2%గా తెలిపింది. నిత్యావసర ధరలతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం వల్ల ద్రవ్యోల్బణం క్రమక్రమంగా పెరుగుతుందని అంతా అంచనాకు వచ్చారు. ఈ పరిణామాలను పరిశీలించిన ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచటం మినహా మరో మార్గం లేదని భావిస్తోంది.
Also Read: Monkeypox outbreak US: అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ, మంకీపాక్స్ కేసులు పెరుగుదలతో నిర్ణయం
Also Read: Rahul Gandhi PC Highlights: 'ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది- నాపై దాడి చేసినా ఓకే, దేనికైనా రెడీ'