Health Emergency in USA:
మంకీపాక్స్ బాధితుల్లో 99% మంది వాళ్లే..
అమెరికాలో మంకీపాక్స్ కేసులు పెరుగుదలతో అప్రమత్తమైన బైడెన్ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అనూహ్య స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతోందని, కట్టడికి చర్యల్ని మరింత బలోపేతం చేస్తున్నామని వైద్యాధికారులు ప్రకటించారు. ఇప్పటికే దాదాపు 7 వేల మంది అమెరికన్లు మంకీపాక్స్ బారిన పడినట్టు అంచనా. ఇకపైనా కేసులు పెరిగే ప్రమాదముందని గుర్తించిన ఆరోగ్య విభాగం...ఎమర్జెన్సీని
అమల్లోకి తీసుకొచ్చింది. మంకీపాక్స్ కట్టడికి అవసరమైన వ్యాక్సిన్లు, మందుల్ని వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటితో పాటు అత్యవసర నిధులు విడుదల చేసి, అదనపు వైద్య సిబ్బందిని నియమించుకోవాలని భావిస్తోంది బైడెన్ ప్రభుత్వం. వాషింగ్టన్, న్యూయార్క్, జార్జియాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీరిలో 99% మంది బాధితులు పురుషులే ఉన్నారు. అది కూడా పురుషులు, పురుషులతోనే శృంగారం చేసిన వారిలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. నిజానికి మంకీపాక్స్ వ్యాక్సిన్ సరఫరా విషయంలో బైడెన్ యంత్రాంగంపై విమర్శలు వస్తున్నాయి. చాలా మంది బాధితులకు వ్యాక్సిన్‌లు అందటం లేదనే అసంతృప్తి నెలకొంది. న్యూయార్క్ సహా శాన్ ఫ్రాన్సిస్కోలో మంకీపాక్స్ రెండు డోసులు అందని వారు చాలా మందే ఉన్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాక్సిన్‌ల సరఫరా పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించటం వల్ల ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.
వ్యాక్సిన్‌లు అందుబాటులోనే ఉన్నాయ్..
బైడెన్ ప్రభుత్వం టీకాలు అందుబాటులోనే ఉన్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే దాదాపు 10 లక్షలకు టీకాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. వారంలో 80 వేల మందికి టెస్ట్ చేసేలా వైద్య సిబ్బందిని సన్నద్ధం చేసినట్టు తెలిపింది. టెకోవిరిమాట్ అనే డ్రగ్‌ను మంకీపాక్స్ చికిత్సకు వినియోగించవచ్చని ఇప్పటికే నిపుణులు సూచించారు. అమెరికా కన్నా ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మొత్తం 75 దేశాల్లో 16 వేల కేసులు నమోదైన నేపథ్యంలో WHO ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే మంకీపాక్స్ పేరు మార్చాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు విజ్ఞప్తి చేసింది న్యూయార్క్ నగరం. అక్కడ మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం వల్ల ప్రజల్లో
భయాందోళనలు తగ్గించేందుకు పేరు మార్చాలని సూచించింది. సరైన ఆరోగ్య రక్షణ లేని వాళ్లు, ఈ పేరుతో మరింత ఆందోళనకు గురవుతున్నారని న్యూయార్క్ అధికార యంత్రాంగం చెబుతోంది. అమెరికాలో ఎక్కడా లేని విధంగా, న్యూయార్క్‌లో వెయ్యికిపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. "మంకీపాక్స్‌పై వస్తున్న వదంతులు, మెసేజ్‌లు ప్రజల్ని భయపెడుతున్నాయి. ఇది కచ్చితంగా దృష్టి సారించాల్సిన విషయం. ఇప్పటికే కొన్ని తెగలు రకరకాల వైరస్‌లు సోకి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిది కూడా తోడైంది. ఆయా వర్గాల ప్రజల ఆందోళన తగ్గించాల్సిన బాధ్యత ఉంది" అని న్యూయార్క్ సిటీ పబ్లిక్ హెల్త్ కమిషనర్ వెల్లడించారు. "మంకీపాక్స్ వైరస్ ఓ వర్గ ప్రజల నుంచే సోకుతుందన్న సమాచారంతో కొందరు వర్ణవివక్ష చూపించే ప్రమాదముంది. అందుకే మంకీపాక్స్ పేరు మార్చాలి" అని WHOకి రాసిన లెటర్‌లో ప్రస్తావించారు.
Also Read: TS Covid Cases : తెలంగాణలో మళ్లీ కోవిడ్ విజృంభణ, కొత్తగా వెయ్యికి పైగా కేసులు నమోదు
Also Read: Viral News: ఇది అదృష్టం కాదు, అంతకుమించి- అడుగేసిన వెంటనే కూలిపోయిన ఫుట్‌పాత్!