Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్‌లో మరో భారత అథ్లెట్ చరిత్ర సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజత పతకం సాధించాడు. బర్మింగ్‌హామ్ గేమ్స్ 2022లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో మన దేశానికి వచ్చిన రెండో పతకం ఇది. బుధవారం నాడు జరిగిన హై జంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్యం నెగ్గగా, గురువారం జరిగిన లాంగ్ జంప్ ఫైనల్స్ లో మురళీ శ్రీశంకర్ సత్తా చాటుతూ రజత పతకం కైవసం చేసుకున్నాడు.
లాంగ్ జంప్ ఫైనల్లో నాటకీయత..
23 ఏళ్ల జాతీయ రికార్డు హోల్డర్, అథ్లెట్ మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ గేమ్స్ 2022 ఫైనల్లో తన ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్ల దూరం దూకాడు. వాస్తవానికి ఇంతే దూరం దూకిన బహామాస్‌కు చెందిన లక్వాన్ నైర్న్ పురుషుల లాంగ్ జంప్ లో స్వర్ణం నెగ్గాడు. ఇద్దరూ ఒకే దూరం దూకినా.. వీరి రెండో అత్యధిక దూరం పరిశీలిస్తే.. శ్రీశంకర్ రెండో అత్యుత్తమ ప్రదర్శన 7.94 మీటర్లు కాగా, లక్వాన్ నైర్న్ 7.98 మీటర్లు దూకడం అతడికి కలిసొచ్చింది. రెండో అత్యుత్తమ ప్రదర్శనలో వెనుకంజలో ఉండటంతో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ స్వర్ణం చేజారింది. దేశానికి రజత పతకాన్ని అందించాడు. మరో భారత ఆటగాడు ముహమ్మద్ అనీస్ యాహియా 7.97 మీటర్ల దూరంతో ఐదో స్థానంలో నిలిచాడు.
విజేతలు వీరే..
కామన్వెల్త్ గేమ్స్ పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో బహామాస్‌కు చెందిన లక్వాన్ నైర్న్, భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ అత్యుత్తమంగా 8.08 మీటర్ల దూరం దూకారు. రెండో అత్యుత్తమ ప్రదర్శనలో బెస్ట్‌గా నిలిచిన లక్వాన్ నైర్న్ స్వర్ణం నెగ్గగా, మురళీ శంకర్ రజతంతో సరి పెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జోవన్ వాన్ వురెన్ 8.06 మీటర్లు దూకి కాంస్యం నెగ్గాడు. మరో భారత ఆటగాడు ముహమ్మద్ అనీస్ యాహియా 7.97 మీటర్ల దూరంతో ఐదో స్థానంలో నిలిచాడు.
తొలి ప్రయత్నంలో కేవలం 7.64 మీటర్లు దూకిన శ్రీశంకర్, రెండో, మూడో ప్రయత్నాలలో 7.84 మీటర్ల దూరం దూకాడు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ అయినా, స్వర్ణం నెగ్గాలన్న కసితో చివరి ప్రయత్నంలో రికార్డు దూరం 8.08 మీటర్లు దూరంతో లక్వాన్ నైర్న్‌తో కలిసి సంయుక్తంగా అధిక దూరం దూకాడు. రెండో అత్యుత్తమ ప్రదర్శనలో మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే శ్రీశంకర్ ఖాతాలో స్వర్ణం చేరేది. భారత్ ఇప్పటివరకూ 19 పతకాలు నెగ్గగా, ఇందులో 5 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలున్నాయి.
Also Read: Commonwealth Games 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు - పతకం తెస్తారా?