TS Covid Cases : తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,318 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 1,061 కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కోవిడ్ మహమ్మారి నుంచి 836 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో 6,357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 401 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 63, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 56, నల్గొండ జిల్లాలో 51, రాజన్న-సిరిసిల్ల 46, కరీంనగర్‌ 43 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.  


కస్తూర్బా గాంధీ పాఠశాలలో కరోనా కలకలం 


నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము కస్తూర్బా గాంధీ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. విద్యార్థుల్లో జ్వరం, దగ్గు లక్షణాలు ఉండడంతో పాఠశాల సిబ్బంది వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు.  దీంతో వైద్య సిబ్బంది కస్తూర్బా పాఠశాలలో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అయితే 20 మంది విద్యార్థినులకు కరోనా పరీక్షలు చేయగా 16 మంది విద్యార్థినులకు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుంటున్నారు. 






తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 1000కి పైగా నమోదు అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కరోనా కలకలం రేగింది. ఈ పాఠశాలలో మొత్తం 20 మందికి కరోనా సోకింది. సోమవారం పాఠశాలలో జ్వరంతో ఉన్న విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కరోనా పరీక్షలు చేశారు. ముందు ముగ్గురికి పాజిటివ్‌ నిర్థారణ అయింది. దీంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమైన పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు, 39 మంది సిబ్బందికి కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 16 మంది విద్యార్థినులకు, ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివ్‌ వచ్చిన 16 మంది విద్యార్థినులను ఇంటికి పంపిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు.