CM Jagan Review : వ్యవసాయశాఖపై సీఎం వైఎస్.జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఖరీఫ్ సీజన్ పై సీఎం జగన్ కు అధికారులు వివరాలను అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యిందని, ఆగస్టు 3 నాటికి 16.2 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, ఈ ఖరీఫ్ సీజన్‌లో 36.82 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అయ్యిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సీఎం మాట్లాడుతూ రైతులకు అందుతున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలని సీఎం ఆదేశించారు. సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపిన అధికారులు, ఆర్బీకేల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నామన్న అధికారులు, రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ప్రతి రోజూ సమాచారం తెప్పించుకోవాలన్నారు.
నూటికి నూరు శాతం ఇ- క్రాప్
ఇ-క్రాప్ వందశాతం పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు మొదటివారంలోగా ఇ–క్రాపింగ్ పూర్తి చేయాలని, ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్‌లు ఈ ప్రక్రియను పూర్తిచేసేలా చూడాలన్నారు. రోజువారీగా ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలన్నారు. ఇ–క్రాపింగ్ పూర్తిచేశాక రశీదు ఇవ్వాలన్నారు. ఇ– క్రాపింగ్ చేసినప్పుడు జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. వెబ్ ల్యాండ్‌తో కూడా అనుసంధానం చేస్తున్నామన్నారు. వెబ్ ల్యాండ్‌లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని సీఎం అన్నారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో భాగస్వామ్యం కానున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్బీకేల్లో ప్రతి కియోస్క్ పనిచేసేలా చూడాలన్నారు. వైఎస్సార్ యంత్రసేవ కింద రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. డ్రోన్ల వినియోగంపై మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఐటీఐ లేదా ఒక పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలని సీఎం జగన్ అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయశాఖ) అంబటి కృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : Visakha Railway Zone : విశాఖ రైల్వే జోన్ ను త్వరగా ప్రారంభించండి, రైల్వే మంత్రిని కోరిన ఎంపీ జీవీఎల్