Adilabad News : సంతానం కోసం ఆంద్ ఆదివాసీలు తరతరాలుగా వస్తున్న శిరాళ్  సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. నాగపంచమి పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు గ్రామాల్లో శిరాళ్ మహోత్సవాన్ని కన్నులపండువగా జరుపుకుంటారు. సంతానం కలిగితే, పిల్లలకు ఉయ్యాల కట్టి ఆడించడం, శిరాళ్ చేసి ప్రత్యేక పూజలు చేయడం ఆంద్ ఆదివాసీ తెగల్లో చాలా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. 


శిరాళ్-వైరాళ్ అంటే 


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాగపంచమి సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా పూజలను జరుపుకుంటారు. నాగపంచమి రోజు పుట్టలో పాలు పోసి నాగ దేవతకు మొక్కులు చెల్లిస్తారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీ తెగల్లోని ఆంద్ తెగవారు మాత్రం భిన్నంగా శిరాళ్ పండుగను నిర్వహిస్తారు. శిరాళ్ - వైరాళ్ అంటే శిరాళ్ ను శివుడిగా - వైరాళ్ ను శివలింగంగా కొలుస్తారు. ప్రకృతి ఒడిలో మమేకమైన ఈ ఆదివాసీలు నాగపంచమి మరుసటి రోజున గ్రామ పొలిమెరల్లో ఉన్న పుట్టమట్టిని సేకరించి ఇంటికి తీసుకోస్తారు. ఈ పుట్టమన్నుతో శివుడి ప్రతిమను తయారు చేస్తారు. అదే విధంగా వైరాళ్ ను తయారు చేస్తారు. అడవిలో లభించే పలు విత్తనాలు వన మూలికలతో వీటిని అందంగా అలంకరిస్తారు. నూతన వస్త్రం శివలింగానికి చుట్టి, సంప్రదాయ నైవేద్యం పెట్టి ఆముదం నూనెతో ఓ దీపాన్ని వెలిగిస్తారు. వీటిని ఆంద్ ఆదివాసీలు శిరాళ్ - వైరాళ్ గా కొలుస్తారు. మహిళలు వీటికి ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయ పాటలతో వాటి చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడతారు. ముఖ్యంగా శిరాళ్ పండుగ మహోత్సవంగా ఈ ఉత్సవాన్ని గ్రామస్తులు అంతా ఏకమై గ్రామ పటేల్ ఇంటి వద్ద ఘనంగా వేడుక నిర్వహిస్తారు. అనంతరం ఆ విగ్రహాన్ని గ్రామ శివారులలోని చెరువు లేదా వాగులో నిమజ్జనం చేస్తారు. 


ఉయ్యాల కట్టి ఊగుతూ 


శిరాళ్ అనేది ఆంద్ ఆదివాసీ తెగల్లో ఓ పెద్ద పండుగ తరతరాలుగా ఆంద్ ఆదివాసీల సంస్కృతి సంప్రదాయం ప్రకారం పూర్వం నుంచి పెద్దలు పాటిస్తున్న ఆచారం. ఈ శిరాళ్ పండుగ నాగపంచమి సందర్భంగా ఘనంగా నిర్వహిస్తారు. నాగపంచమికి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించిన అనంతరం ఆంద్ ఆదివాసీలు మరుసటి రోజున పుట్టమట్టితో తయారు చేసిన శిరాళ్ ను శివుడి రూపంలో కొలుస్తారు. మహిళలు అత్యధికంగా తమకు సంతాన యోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఈ పూజల్లో తాము కోరిన కోరిక నెరవేరితే వారు శిరాళ్ ను చేసి, ఓ ఉయల కట్టి ఘనంగా పూజలు చేసి పండుగను నిర్వహిస్తారు. దాంతో పాటు ఇంట్లో ఓ ఉయ్యాలను కడతారు. ఈ ఉయ్యాలలో చిన్న పిల్లలను మహిళలు ఆడిస్తారు. అందరు ఆనందంగా ఈ ఉయ్యాలలో ఊగుతూ సంప్రదాయ పాటలతో సందడి చేస్తారు. చివరి రోజున శిరాళ్ వైరాళ్ ప్రతిమలకు పూజలు చేసి మగ వారు వాటిని తలపై ఎత్తుకోని గ్రామ పొలిమెరల్లోని చెరువు లేదా వాగుల్లో నిమజ్జనం చేస్తారు.  నాగపంచమి సందర్భంగా వారం రోజుల పాటు ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కడ చూసిన ఈ పూర్వకాలం నాటి సంప్రదాయం ప్రకారం ఉయ్యాల ఊగుతూ కనిపిస్తుంటారు.  ఇలా ఆంద్ ఆదివాసీలు తమ సంప్రదాయ శిరాళ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు.