Taiwan:
మేమెక్కడ పర్యటించాలన్నది చైనా ప్లాన్ చేయలేదు: నాన్సీ
తైవాన్‌ను ఒంటరి చేయాలన్న చైనా ఆలోచనను అమెరికా సహించదని యూఎస్ హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. టోక్యో పర్యటనలో ఉన్న ఆమె..ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె ఆసియా టూర్‌లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆమె తైవాన్‌లోనూ పర్యటించటంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. "చైనా తైవాన్‌కు మరో దేశంతో సంబంధం లేకుండా అడ్డుకుంటుందేమో. కానీ ఈ దేశాన్ని పూర్తిగా ఒంటరిగా మాత్రం మార్చలేదు. అందుకు మేం ఒప్పుకునేదే లేదు. మేమెక్కడ పర్యటించాలన్నది చైనా ప్లాన్ చేయలేదు" అని స్పష్టం చేశారు నాన్సీ పెలోసీ. పాతికేళ్లలో తైవాన్‌లో పర్యటించిన మొట్టమొదటి హౌజ్ స్పీకర్ ఈమే. తైవాన్‌లో ప్రజాస్వామ్యం ఉండాలని బలంగా కోరుకుంటున్నామని, దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా యూఎస్-తైవాన్ సంబంధాలనూ ప్రస్తావించారు. "అమెరికా, తైవాన్ మధ్య బలమైన మైత్రి ఉంది. ఇక్కడ శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు ఎప్పటికీ మద్దతునిస్తాం" అని వెల్లడించారు.
క్షిపణులు ప్రయోగించిన చైనా
"నేను తైవాన్‌కు రావటంపై చైనా చాలా హడావుడి చేస్తోంది. ఆందోళన చెందుతోంది. తైవాన్‌ను ఒంటరి చేయాలని వాళ్లు ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశాల్లోనూ వారికి ప్రాతినిధ్యం లేకుండా చేస్తోంది" అని విమర్శించారు నాన్సీ పెలోసీ. సింగపూర్, మలేషియా, తైవాన్, సౌత్ కొరియాల్లో పర్యటించిన తరవాత చివరగా టోక్యోకు వచ్చారు. ఆమె తైవాన్ పర్యటనకు వస్తున్నారని తెలిసిన వెంటనే చైనా తీవ్రంగా స్పందించింది. అవసరమైతే అమెరికాతో యుద్ధం చేసేందుకైనా సిద్ధమేనంటూ ప్రకటన చేసింది. అంతే కాదు. తైవాన్‌లోనూ అలజడి సృష్టించింది. తైవాన్‌లోని ఆరు ప్రాంతాల్లో క్షిపణులు ప్రయోగించింది. దాదాపు 5 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించటం సంచలనమైంది.
అయితే..ఈ మిసైల్స్ జపాన్ భూభాగంలో పడటం వల్ల ఆ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్గత శాంతి, భద్రతలను దెబ్బ తీస్తే ఊరుకోమని జపాన్..చైనాను హెచ్చరించింది. జపాన్ ప్రధానమంత్రి కిషిద...చైనా వెంటనే ఈ క్షిపణుల ప్రయోగాల్ని ఆపేయాలని హెచ్చరించారు.