బర్మింగ్ హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్ 2022లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టర్లు భారత పతకాల భారాన్ని మోస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి 313 కేజీల బరువులు ఎత్తి స్వర్ణ పతకాన్ని సాధించాడు. దాంతో భారత్ ఖాతాలో మూడు స్వర్ణం చేరింది. శనివారం నాడు మీరాబాయి చాను రూపంలో తొలి స్వర్ణం రాగా, ఆదివారం మధ్యాహ్నం జెరెమీ లాల్ రినంగ్, అర్ధరాత్రి దాటిన తర్వాత అచింత షూలి వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో బంగారం సాధించారు. 


20 ఏళ్ల యువకుడు అద్భుతం..
భారత వెయిట్ లిఫ్టర్ అచింత షూలి 73 కేజీల విభాగంలో బరిలో దిగాడు. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు ఎత్తిన ఈ 20 ఏళ్ల కుర్రాడు, రెండో ప్రయత్నంలో మరింత ప్రయత్నించి 140 కేజీలు ఎత్తాడు. ఎలాగైనా బంగారం నెగ్గాలన్న కసితో మూడో ప్రయత్నంలో ఏకంగా 143 కేజీల బరువులు ఎత్తి సత్తా చాటాడు. కామన్వెల్త్ గేమ్స్ లోనే రికార్డ్ సృష్టించాడు. ఆపై క్లీన్ అండ్ జర్క్ కేటగిరీలో 170 కేజీలు ఎత్తి.. ఓవరాల్‌గా 313 కేజీల బరువులు ఎత్తి బంగారం కొండగా నిలిచాడు. మలేసియాకు చెందిన హిదాయత్‌ (303 కేజీలు) రజతం నెగ్గగా, కెనడా వెయిట్ లిఫ్టర్ షాద్‌ (298 కేజీలు) కాంస్యం సాధించాడు.






స్వర్ణంగా మారిన రజతం..
2015లో జరిగిన జూనియర్‌ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో అచింత షూలి రజతం గెలిచాడు. ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్‌ 2018లో రజతం (Silver Medal) సాధించిన అచింత షూలి.. కామన్వెల్త్ సీనియర్, జూనియర్ ఛాంపియన్ షిప్ 2019లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో కచ్చితంగా స్వర్ణం నెగ్గాలన్న కసితో బరువులు ఎత్తి త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదిక మీద రెపరెపలాడించాడు. 2021లో జరిగిన వరల్డ్ జూనియర్ ఛాంపియన్ షిప్‌లో రెండో స్థానంలో నిలిచి రజతం నెగ్గాడు.
Also Read: Jeremy Lalrinnung Wins Gold: బంగారు కొండ ఎత్తిన లాల్‌రినంగ్‌! రెండో స్వర్ణం అందించిన 19 ఏళ్ల కుర్రాడు






ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 6 పతకాలు సాధించగా, అందులో 3 స్వర్ణాలు, 2 రజతాలు, కాంస్య పతకాలు ఉన్నాయి.