Jeremy Lalrinnung Wins Gold: కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. నిన్న మీరాబాయి చాను స్వర్ణం అందించింది. నేడు 19 ఏళ్ల జెరెమీ లాల్‌రినంగ్ బంగారు కొండను ఎత్తాడు. పరుషుల 67 కిలోల విభాగంలో స్వర్ణ పతకం ముద్దాడాడు. స్నాచ్‌లో 140 కిలోలతో కామన్వెల్త్ రికార్డు సృష్టించాడు. క్లీన్ అండ్ జర్క్‌లో 160 కిలోలు మొత్తంగా 300 కిలోలతో సంచలనం సృష్టించాడు. అరంగేట్రం క్రీడల్లోనే అతడు పతకం గెలవడం ప్రత్యేకం. మొత్తంగా భారత్‌కు ఇది ఐదో పతకం. రెండో స్వర్ణం.
రెండు ప్రయత్నాల్లోనే!
స్నాచ్ విభాగంలో లాల్‌రినంగ్ మొదట 136 కిలోలు ఎత్తాడు. రెండో ప్రయత్నంలో 140 కిలోలకు పెంచి కామన్వెల్త్ రికార్డు సృష్టించాడు. మూడో రౌండ్లో 143 కిలోలు ఎత్తుతూ విఫలమయ్యాడు. క్లీన్ జండ్ జర్క్‌లో తొలి ప్రయత్నంలో 154 కిలోలు, రెండో ప్రయత్నంలో 160 కిలోలు ఎత్తాడు. మూడో రౌండ్లో 165 ఎత్తే క్రమంలో విఫమయ్యాడు. మొత్తంగా 300 కిలోలతో పసిడి ముద్దాడాడు. వైపవా నొవో ఐవనె 293 (స్నాచ్‌లో 127, క్లీన్ అండ్ జర్క్‌లో 166) కిలోలతో రజతం సాధించాడు. నైజీరియా వెయిట్ లిఫ్టర్ ఎడిడాంగ్ జోసెఫ్ 290 (130, 160) కిలోలతో కాంస్యం కైవసం చేసుకున్నాడు.
స్వర్ణమే ముద్దు!
మిజోరం రాజధాని ఐజ్వాల్ నుంచి లాల్‌రినంగ్ వచ్చాడు. 2018 నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఎక్కిడికి వెళ్లినా స్వర్ణ పతకంతో తిరిగి రావడం అలవాటు. 2021తో తాష్కెంట్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్, 2018లో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పసిడి పతకాలు ముద్దాడాడు. ఆడిన ప్రతిసారీ తన రికార్డును తానే తిరగ రాసేందుకు ప్రయత్నిస్తాడు.
ఒక్కరోజే నాలుగు
వెయిట్ లిఫ్టర్లు శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4 పతకాలను దేశానికి అందించారు. మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్ లో మరో స్వర్ణంతో మెరిసింది. దేశానికే చెందిన ఇతర వెయిట్ లిఫ్టర్స్ సంకేత్ రజతం, బింద్యారాణి రజతం, గురురాజ పూజారి కాంస్య పతకం అందుకున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ ఎక్కడంటే..
ఈ ఏడాది మొదలైన కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల బోణీ కొట్టింది. వెయిట్ లిఫ్టర్లు దేశం పేరు నిలబెడుతూ పతకాల మోత మోగించారు. భారత్ 2 స్వర్ణాలతో పాటు 2 రజతాలు, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దాంతో 2022 పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది.