భారత మహిళా బౌలర్ శిఖా పాండే ఆస్ట్రేలియా మీద జరుగుతున్న రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన బంతిని సంధించింది. ఈ బంతికి ఆస్ట్రేలియా బ్యాట్స్ఉమన్ అలీసా హీలీ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో 119 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. అయితే శిఖా పాండే ఇన్నింగ్స్ రెండో బంతికి ఆస్ట్రేలియా ఓపెనర్ హీలీని అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపించింది. బంతి పిచ్ అయి వికెట్లను చేరే వరకు చూడటం మినహా హీలీ ఏమీ చేయడం లేదు. ఆ అద్బుతమైన బంతిని కింద వీడియోలో చూడండి.
ఈ వీడియో ఇప్పుడు ట్వీటర్‌లో వైరల్‌గా మారింది. శిఖా వేసిన బంతికి ఎంతోమంది ఫ్యాన్స్ అవుతున్నారు. ‘మహిళల క్రికెట్లో ఈ శతాబ్దపు బంతి ఇదేనని, శిఖా పాండే టేక్ ఏ బో’ అని భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నారు. దీంతోపాటు పలువురు నెటిజన్లు శిఖాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత క్రికెట్ జట్టుకు పేలవమైన ఆరంభం లభించింది. 24 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేసింది. అయితే తను 28 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఒకపక్క వికెట్లు పడుతున్నా పూజా వస్త్రాకర్ 26 బంతుల్లోనే 37 పరుగులు చేయడంతో భారత జట్లు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ రెండో బంతికే హీలీ వికెట్‌ను కోల్పోయినా.. తర్వాత బ్యాట్స్‌ఉమెన్ చెలరేగి ఆడటంతో 19.1 ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి