తమిళ హీరో శివకార్తికేయన్, గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ జంటగా.. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో ‘బీస్ట్’ రూపొందిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాక్టర్’. దీన్ని తెలుగులోకి ‘వరుణ్ డాక్టర్’ పేరుతో అనువదించారు. తమిళంలో సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో వస్తున్న పెద్ద సినిమా ఇదే. అయితే తెలుగులో మాత్రం దీనిపై పెద్దగా అంచనాలు లేవ్.. సినిమా ట్రైలర్‌ను కూడా పూర్తి సీరియస్‌గా కిడ్నాప్ డ్రామా అన్నట్లు చూపించారు. మరి సినిమా ఎలా ఉంది?
కథ: మిలటరీ డాక్టర్ అయిన వరుణ్ పూర్తిగా ప్రాక్టికల్. అతనికి పద్మిని(ప్రియాంక అరుల్ మోహన్)తో పెళ్లి ఫిక్సవుతుంది. అయితే ఆరు నెలల తర్వాత వరుణ్‌కు అస్సలు ఎమోషన్స్ లేవని, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పద్మిని.. వరుణ్‌తో చెప్తుంది. దీని గురించి మాట్లాడటానికి వరుణ్ కుటుంబంతో పద్మిని ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో స్కూలుకి వెళ్లిన పద్మిని కుటుంబంలోని చిన్న పాప కిడ్నాప్ అవుతుంది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌లో గత నాలుగేళ్లలో 400 మంది యుక్తవయసులో ఉన్న ఆడపిల్లలు కనపడకుండా పోయారని తెలుస్తుంది. ఆ పాపను కాపాడటానికి వరుణ్ ఏం చేశాడు? అసలు దీని వెనుక ఏం జరిగింది? పద్మిని వరుణ్‌ను ఇష్టపడుతుందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే..
ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయ్.. నెల్సన్‌తో సినిమా ఒప్పుకోవడానికి ముందు కేవలం కొలమావు కోకిల (తెలుగులో కోకో కోకిల) అనే ఒక్క సినిమా మాత్రమే తీశాడు. అది పూర్తి స్థాయి కామెడీ థ్రిల్లర్. డాక్టర్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంకా రిలీజ్ కాలేదు. ఏ నమ్మకంతో విజయ్ లాంటి టాప్ స్టార్ నెల్సన్‌కు అవకాశం ఇచ్చాడనే సందేహాన్ని ఈ సినిమా తీర్చేస్తుంది. ఇప్పటివరకు చూడని ఒక కొత్త శివ కార్తికేయన్‌ను ఈ సినిమాలో చూడవచ్చు. కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని విషయాలకు సమానంగా ప్రాధాన్యం ఇచ్చాడు. కామెడీకి ప్రత్యేక ట్రాకులు పెట్టకుండా.. సిట్యుయేషనల్ కామెడీని అద్భుతంగా పండించాడు. ఇక వన్‌లైనర్స్ అయితే అద్భుతంగా పేలాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే మెట్రో యాక్షన్ ఫైట్.. ఇప్పటివరకు మనం చూసిన యాక్షన్ సీక్వెన్స్‌లకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. అయితే ఫస్టాఫ్‌ను పూర్తి రేసీగా నడిపించిన నెల్సన్.. సెకండాఫ్‌లో కాస్త స్లో అయ్యాడు. కామెడీ కూడా సెకండాఫ్‌లో కాస్త తక్కువగా ఉంటుంది. కథ నుంచి పూర్తిగా డిస్‌కనెక్ట్ అయ్యేంత బోర్ మాత్రం కొట్టదు.
ఈ సినిమాలో సరికొత్త శివ కార్తికేయన్‌ను స్క్రీన్ మీద చూడవచ్చు. మొహంలో ఏమాత్రం ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా, పూర్తిగా ప్రాక్టికల్‌గా, ఇంటెలిజెంట్‌గా ఉండే పాత్ర. ఒక రకంగా చెప్పాలంటే.. రేసుగుర్రంలో శృతి హాసన్ పోషించిన స్పందన పాత్రకు మేల్ వెర్షన్ అనుకోవచ్చు.‘షర్ట్‌కు పై బటన్ ఎందుకు పెట్టుకున్నావు’ అని హీరోయిన్ అడిగినప్పుడు... ‘బటన్ ఇచ్చింది పెట్టుకోవడానికే కదా’ అనేంత ప్రాక్టికల్. తన బలం అయిన కామెడీని ఈ సినిమాలో పూర్తిగా వదిలేసి.. కథకు ఏది అవసరమో అంతవరకు మాత్రమే పెర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు. ప్రియాంక అరుల్ మోహన్‌ది కథలో కీలక పాత్రే అయినా.. ఒక్కసారి హీరో లైన్‌లోకి దిగాక తనకు నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. అయితే స్క్రీన్ మీద ఉన్నంత సేపు అందంగా కనిపించింది.
ఇక విలన్‌గా నటించిన వాన ఫేం వినయ్ రాయ్ ఉన్నంతలో బాగానే నటించాడు. తను గతంలో చేసిన డిటెక్టివ్ సినిమా విలన్ పాత్ర తరహాలోనే ఈ క్యారెక్టర్ కూడా ఉంది. ఇక యోగిబాబు, ఇన్వెస్టిగేషన్‌లో హీరోకు సహకరించే పోలీస్ ఫ్రెండ్ పాత్ర పోషించిన రెడిన్ కింగ్‌స్లే.. ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్స్. శివకార్తికేయన్ పాత్రకు కామెడీ పండించే స్కోప్ లేకపోవడంతో సినిమాలో కామెడీని ప్రధానంగా వీరే మోశారు.
వీళ్లతో పాటు అనిరుథ్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఇప్పటివరకు వచ్చిన పాటలన్నీ చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. ఇక సినిమాకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం. తన కెరీర్‌లో టాప్-5 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు ఉన్న సినిమాలు తీస్తే.. అందులో డాక్టర్ కచ్చితంగా ఉంటుంది.
ఓవరాల్‌గా చెప్పాలంటే.. థియేటర్‌లో ఒక కొత్త తరహా యాక్షన్ కామెడీ చూడాలి అనుకుంటే.. వరుణ్ డాక్టర్ పర్‌ఫెక్ట్ చాయిస్. జబర్దస్త్ కామెడీలా కాకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చక్కటి కామెడీ ఇందులో ఉంది. ఈ వీకెండ్‌కు మంచి కామెడీ ట్రీట్‌మెంట్ కావాలంటే వరుణ్ డాక్టర్‌ను కన్సల్ట్ చేయచ్చు.