ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌, శివ నర్వాల్‌, అర్జున్‌ సింగ్‌ చీమా జట్టు బంగారు పతకాన్ని సాధించింది. టీమ్‌ ఈవెంట్‌లో భారత త్రయం 1734 పాయింట్లతో అగ్రస్థానంలో నిలచింది. 1733 పాయింట్లు సాధించిన చైనా జట్టు ఒక్క పాయింట్‌ తేడాతో ఓడిపోయింది. కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఇదే విభాగంలో సరబ్‌జ్యోత్‌ సింగ్‌, అర్జున్‌ సింగ్‌ టాప్‌ 8కు అర్హత సాధించారు. సరబ్‌జ్యోత్‌ 5వ ప్లేస్‌లో ఉండగా, అర్జున్‌ 8వ స్థానంలో నిలిచాడు. 


చైనాలోని హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ గేమ్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. వరుసగా మెడల్స్ సాధిస్తూ దూసుకుపోతున్నారు. భారత షూటర్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇండియా ఐదు గోల్డ్ మెడల్స్ సాధించగా.. తాజాగా 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పురుషుల విభాగంలో మరొకటి భారత్ ఖాతాలో చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించిన అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్‌లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 


పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ సాధించిన బంగారం పతకంతో కలిపి... భారత్‌కు ఇప్పటి వరకు మొత్తంగా ఆరు స్వర్ణ పతకాలు వచ్చాయి. అందులో నాలుగు మెడల్స్ షూటింగ్‍లోనే వచ్చాయి. ఆసియన్ గేమ్స్ 2023లో ఇప్పటి వరకు భారత్ 24 పతకాలతో ఐదో స్థానంలో ఉంది. భారత్‍కు వచ్చిన 24 పతకాల్లో ఆరు బంగారం, 8 సిల్వర్‌, 10 బ్రాంజ్ మెడల్స్. ఇక, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‍లో 1733 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఆతిథ్య చైనా 146 మెడల్స్ సాధించింది. చైనా సాధించిన మెడల్స్‌లో 81 బంగారు పథకాలు, 44 సిల్వర్‌, 21 బ్రాంజ్‌ ఉన్నాయి. ఆసియా క్రీడల్లో మొదటి స్థానంలో చైనా ఉండగా.. 71 పతకాలతో రెండో స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా నిలిచింది.