Telangana BJP : తెలంగాణ బీజేపీ సర్వశక్తులు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత పుంజుకోకపోగా మరింత బలహీనపడినట్లయింది. ఓ వైపు కేంద్ర మంత్రిగా.. మరో వైపు రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న సమయంలో ఇక పూర్తిగా తెలంగాణకే సమయం కేటాయించనున్నారు. హైకమాండ్ కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచాలని నిర్ణయించింది. నేతలు, పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కొంత కాలంగా డీలా పడిన బీజేపీ శ్రేణులు
ఎన్నికల వేళ బీజేపీ సైలెంట్ కావడం, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆ పార్టీ శ్రేణలు కాస్త డీలాపడ్డాయి. కానీ ఇక నుంచి మళ్లీ యాక్టివ్ కావాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా బహిరంగ సభలతో హోరెత్తించేందుకు సిద్దమవుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. అక్టోబర్‌లో ఏకంగా 30 నుంచి 40 బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్దమవుతుంది. ఈ సభల్లో కేంద్రమంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు పాల్గొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అన్ని జిల్లాలను కవర్ చేసేలా సభలను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1న జరిగే సభలో తెలంగణ ఎన్నికలకు మోదీ సమరశంఖం పూరించనున్నారు. 7వ తేదీన ఆదిలాబాద్‌లో కేంద్రం హోమంత్రి అమిత్ షా సభ ఉండనుంది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు కనిపిన్నాయి. దీంతో బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది.ఈ బహిరంగ సభల ద్వారా శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేయడంతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు ప్రవేశపెడతామనేది బీజేపీ వివరించనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించనున్నారు. మొత్తానికి ఈ సభల ద్వారా రాజకీయ వేడి పెంచాలని బీజేపీ చూస్తోంది.
ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల కమిటీ నియామకం
మరో వైపు తెలంగాణ ఎన్నికలకు బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్టీ ఐదు రాష్ట్రాల నుంచి ఇరవై ఆరు మంది ముఖ్య నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 26 మంది నేతలతో కేంద్ర ఎన్నికల కమిటీని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు నియమించడం జరిగింది . ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ ఎన్నికల కమిటీలో సభ్యులు ఉన్నారు. వీరిలో పలువురు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఉన్న అనువైన పరిస్థితులు ఉన్నాయని అందర్నీ సమన్వయం చేసుకోవడం, అభ్యర్థుల ఎంపిక, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిచడం, ప్రచారం, జాతీయ నేతలు బహిరంగ సభలు నిర్వహణ , ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన సాయం చేయడం వంటి బాధ్యతల్ని ఈ ఎన్నికల కమిటీ నిర్వహిస్తుంది. తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకూ అంటే డిసెంబర్ మొదటి వారం వరకూ ఈ కమిటీ తెలంగాణ పూర్తి సమయం ఉండి రాష్ట్ర , కేంద్ర మంత్రులు పార్టీ జాతీయ నాయకత్వంతో కలిసి పని చేస్తుంది.
వరుసగా ముఖ్య నేతల పర్యటనల జోరు
వరుసగా బీజేపీ వ్యూహంలో భాగంగా అగ్రనేతలంతా తెలంగాణకు క్యూకట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబరు 1న మహబూబ్‌నగర్ వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపడంతోపాటు.. ఎన్నికలకు సిద్ధమయ్యేలా పలు సూచనలు చేయనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి ఇప్పటికే టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. మహబూబ్‌నగర్ పట్టణ శివార్లలోని భూత్‌పూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మోడీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది. ప్రధాని మోడీ సభ ఎన్నికలకు ముందు కీలకం కానుంది. ఓ వైపు సభతో పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయడం.. మరోవైపు నేతలకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్‌గా ప్రధాని మోదీ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోదీ సభ తర్వాత బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం వెల్లడించే ఛాన్స్ ఉంది. ప్రధాని మోడీతోపాటు.. బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు.