జిహెచ్ఎంసి లో పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న మహిళా గురువారం సాయంత్రం సికింద్రాబాద్ లోని మెట్టుగూడ బావి వద్ద నాలాలో పడి మృతి చెందింది. ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా బ్రిడ్జి కింద నుంచి వెళ్లే ప్రయత్నంలో మహిళ ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది.


నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో కొట్టుకుపోయి అంబర్ నగర్ వద్ద విగతజీవిగా తేలింది. నాలాలో పడిన వెంటనే ఆమెను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో కాపాడలేకపోయారు.  ఘటన స్థలానికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు, జిహెచ్ఎంసి సిబ్బంది ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 50 సంవత్సరాల వయసు గల ఓ మహిళ కమాన్ లోపల నుంచి రోడ్డు దాటుతుంది. కురిసిన వాసానికి పక్కనే ఉన్న నాలా ఉద్ధృతంగా పెరగడంతో పక్కన ఉన్న స్థానిక ప్రజలు హెచ్చరించిన ఆగకుండా ఆ మహిళ కామన్ దాటడానికి ప్రయత్నించి కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు స్థానిక కార్పొరేటర్ సునీత దృష్టికి తీసుకెళ్లారు.


తక్షణమే స్పందించిన కార్పొరేటర్ డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసి అధికారులకు సమాచారం అందించారు. నాలా వెంబడి వెతికిన బౌద్ధ నగర్ డివిజన్ పరిధిలో అంబర్ నగర్ నాలా వద్ద మహిళ మృతదేహం దొరికింది. మహిళా శరీరం ఉబ్బిపోవడంతో ఎవరైనాది ఇంకా గుర్తించలేకపోయారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 


హైదరాబాద్‌లో భారీ వర్షం 


అయితే మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతి నగర్, నిజాంపేట్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, సీతాఫల్‌మండి, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షం కారణంగా గణేశ్ శోభాయాత్రను వీక్షించడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే భారీ వర్షంలోనూ శోభాయాత్ర కొనసాగిస్తున్నారు. వర్షం కారణంగా కొన్నిచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. 


ఇకపోతే.. తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై వుంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. నిర్మిల్, కామారెడ్డి, భద్రాద్రి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.  


ఇదిలా ఉంటే నిమజ్జనం జరుగుతున్న హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. పెద్ద వర్షం కురిసినా గణేశ్ శోభాయాత్రకు ఎలాంటి అంతరాయం కలగలేదు. భక్తులు అంత వర్షంలోనూ డ్యాన్సులు చేస్తూ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. 10 రోజుల పాటు పూజలందుకున్న లంబోదరున్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద వానలోనే నిమజ్జనం కొనసాగుతోంది. ఇక ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం ఇప్పటికే ముగిసింది.