Hockey India Cash Prize:


ఆసియా క్రీడల్లో భారత్ హాకీ జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన 19 ఏషియన్ గేమ్స్ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ను భారత్ చిత్తు చేసింది. 5-1  గోల్స్ తేడాతో భారత్ ఏషియా గేమ్స్ లో మరోసారి చాంపియన్ గా నిలిచింది. తొమ్మిదేళ్ల తరువాత భారత హాకీ టీమ్ గోల్డ్ నెగ్గింది. 


హాకీ జట్టుకు క్యాష్ రివార్డ్..
హాకీ నెగ్గిన భారత జట్టుకు హాకీ ఇండియా రికార్డు ప్రకటించింది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రూ.5 లక్షల క్యాష్ రివార్డు ఇవ్వనున్నామని తెలిపింది. వీరితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ నకు సైతం ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల క్యాష్ రివార్డు ప్రకటించారు.


ఈ టోర్నీలో అత్యధికంగా 13 గోల్స్‌తో దుమ్మురేపిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌.. ఫైనల్లోనూ జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (32వ, 59వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో విజృంభించాడు. అమిత్‌ రొహిదాస్‌ (36వ నిమిషంలో), మన్‌ప్రీత్‌ సింగ్‌ (25వ నిమిషంలో), అభిషేక్‌ (48వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేయగా.. ప్రత్యర్థి జపాన్‌ తరఫున సరెన్‌ టనాక (51వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేయడంతో భారత్ 5-1 తేడాతో ఘన విజయం సాధించింది.


2014లో ఇంచియాన్‌ వేదికగా జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన టీమ్‌ఇండియా.. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్య పతకానికి పరిమితమైంది.  తొమ్మిదేళ్ల తర్వాత హాంగ్జౌలో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత జట్టు గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో భారత్‌కిది నాలుగో స్వర్ణం. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణ పతకం కాగా, గతంలో టీమ్‌ఇండియా 1966, 1998, 2014లోనూ విజేతగా నిలిచింది.


ఏసియన్ గేమ్స్ లో గత ఎడిషన్ వరకు 70 పతకాలే అత్యధికం కాగా, చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 95 పతకాలు నెగ్గింది. మరికొందరు ఆటగాళ్లు సెమీస్, ఫైనల్ చేరారు. ఆ మ్యాచ్ లు పూర్తయితే భారత పతకాల సంఖ్య 100 దాటనుంది. దాంతో ఏషియా గేమ్స్ లో భారత్ తొలిసారి పతకాలలో సెంచరీ మార్కుతో హోరెత్తించనుంది.






ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గాలని ఉంది..
2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం నెగ్గడమే తమ లక్ష్యమని ఏషియన్ గేమ్స్ లో స్వర్ణం నెగ్గిన అనంతరం మన్ దీప్ సింగ్ తెలిపాడు. ఇక్కడ పసిడి పతకం సాధించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ప్రపంచ ర్యాంకు 3లో ఉన్నామని.. భారత్ చేసిన గోల్స్ ఆటగాళ్ల వ్యక్తిగత గోల్స్ కాదని.. జట్టు సమష్టి కృషి అన్నాడు. కీలకమైన టోర్నీలో పసిడి నెగ్గడం తన జీవితంలో గొప్ప క్షణం అని ఏఎన్ఐ తో మాట్లాడుతూ మన్ దీప్ సింగ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.